Saturday, 11 August 2012

అక్షరంలో ఒదిగిన 'హిరోషిమా'
హిరోషిమా.. ఓ చేదు జ్ఞాపకం. తప్పదు, గుర్తుంచుకోవాల్సిందే.
మానవాళి మనుగడను సవాలు చేసే ఇటువంటి దుస్సంఘటనలను మర్చిపోతే ఎలా? ఎన్నో ప్రాణాలను మసి చేసిన దారుణాన్ని కాలమైనా మాన్పలేదు. మరోసారి మళ్లీ, ఎక్కడా ఇలాంటి ఉదంతాలు కానరాకూడదు.. సాంకేతికత మానవ జాతి మనుగడకే కానీ, మారణహోమానికి కాదని, పదే పదే వెన్నుతట్టే వైనం.. హిరోషిమా. హిరోషిమాపై వ్యాసం రాయని పత్రిక అంటూ
ప్రపంచంలో ఏ మూలైనా ఒకటైనా వుంటుందా? అలా అని కొన్ని అక్షరాల్లోనో, కొన్ని పంక్తుల్లోనో, కాసిన్ని పేరాల్లోనో ఒదిగే దారుణమా అది? కాదు కదా. అందుకే పత్రికలో తప్పని సరిప్రకటనలు వదిలి, మిగిలిన పేజీలన్నీ హిరోషిమాతో నింపేసిందిఓ విదేశీ పత్రిక ఓసారి.
ఒక వారపత్రికగా పలు శీర్షికలూ, కార్టున్లూ, ప్రకటనలతో వారం వారం అచ్చులో కన్పించే ‘ది న్యూయార్కర్’- ఆగస్టు 31, 1946 సంచికను హిరోషిమా సంగతులతో నింపేసింది.
‘1945 ఆగస్టు 6న ఒక నగరంపై ఆటం బాంబు వేసి సమూలంగా నాశనం చేసిన దారుణంపై, అక్కడి ప్రజలపై ఎటువంటి పరిణామాలు కలిగాయో చెప్పే వాస్తవ నివేదికగా ‘ది న్యూయార్కర్’ సంచిక మొత్తాన్ని అందజేస్తున్నాము. మనలో కొందరైనా అణ్వాయుధాలకు ఉన్న అపరిమితమయిన వినాశనశక్తి పట్ల, అసలు వీటిని మానవులపై ప్రయోగించవచ్చా? అనే అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోగలుగుతారనీ, పాఠకలోకమంతా ఈ బాంబులవల్ల కలిగే భయంకర ఫలితాల గురించి కొద్దిపాటి సమయాన్ని వెచ్చించాకయినా సరే ఒక ఆలోచనకు వస్తార’ని ఆ పత్రిక ముందు మాటలో పేర్కొంది. తన తేలికపాటి రచనల స్వభావానికి విరుద్ధంగా సమకాలిక పత్రిక ‘ది న్యూయార్కర్’ మొత్తంగా ఒక సంచికను ఒకే కథనానికి కేటాయించి కొత్త చర్చను లేవదీసింది. హిరోషిమాలో రెండు లక్షల నలభయి అయిదు వేల ప్రజలలో దాదాపు లక్ష మంది ఏమయ్యారో అందరికీ తెలుసు. వారు బాంబు దాడిలో చనిపోయారు. వేలాదిమంది అవశేషాలు సైతం మిగలకుండా, మిగిలిన ప్రజా జీవితాలను, ఆరు సజీవ సామాన్య వ్యక్తుల పాత్రల ద్వారా, వాస్తవ జీవన కథనంగా ‘ది న్యూయార్కర్’ పాత్రికేయుడు జాన్ హెర్సీ ‘హిరోషిమా’ పేరిట అందించిన రచన ఎంతో ప్రాధాన్యతను సంతరిం చుకుంది. బాంబు దాడి తర్వాత సైతం ఎలా అక్కడి ప్రజలు జీవిస్తున్నారో తెలియచెప్పిన రచన ఇది. అమెరికన్ సమాజంలో మనం, కొత్తగా మనకు లభ్యమైన సైనిక ఆయుధశక్తి గురించి, ఇతర దేశాలపై దీని ప్రయోగిస్తే ఏమవుతుందో జోకులు వేసుకున్నట్టుగా కాక, ఇతర సాంకేతిక ఆవిష్కరణలయిన కార్లూ, ఫోన్లూ, విమానాలూ వంటి వాటికీ, ఈ ప్రత్యేక ఆయుధ ఆవిష్కరణకూ మధ్యగల తేడాను అర్థం చేసుకోవడానికి ఈ రచన ఉపకరిస్తుంది. పుస్తకంగా అచ్చులో రావడానికి ముందే ఓ క్లాసిక్‌గా ‘హిరోషిమా’ రచన గుర్తింపు పొందింది.
దీంతో జాన్ హెర్సీకి స్టార్ జర్నలిస్ట్ హోదా వచ్చి పడింది. సాక్షాత్తూ ఐన్‌స్టీన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత శాస్తవ్రేత్త, తనకు ఆ సంచిక కాపీలు ఒక పదివేలు కావాలని అడిగినా, వాటిని సరఫరా చేసే పరిస్థితిలో పత్రిక ప్రచురణకర్తలు లేరు. బి.బి.సి ఈ రచన బ్రాడ్ కాస్టింగ్ హక్కులుపొందగా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలలో ఇది ప్రసారమయ్యింది. తమ విభేదాలతో ప్రమేయం లేకుండా రోమన్ కాథలిక్ పత్రికలూ, ప్రొటెస్టెంట్ పత్రికలూ బాంబు దాడిపట్ల తాము అంతవరకూ వింటూ వచ్చిన దానికన్నా బహు శక్తివంతమైన రచనగా హెర్సీ రచనను ప్రస్తుతించాయి.
అనేక దేశాలలో పలు అనువాదాలు ముద్రణ జరిగి ముప్ఫయి లక్షల కాపీలు పైగా అమ్ముడైన రెండో ప్రపంచ యుద్ధ కాలపు ఏకైక రచనగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది- జాన్ హెర్సీ రాసిన ‘హిరోషిమా’.
అయితే ఎవరి సమాజపు దురవస్థల గురించి ఈ రచన చేయబడిందో, ఆ జపాన్ ప్రజలకు మాత్రం 1949 వరకూ ఈ రచన చదివే అవకాశం దక్కలేదు. ఇందుకు కారణం. జపాన్‌ను సైనిక పరిపాలనలో వుంచిన అమెరికన్ ప్రభుత్వ సైన్యాధిపతి జనరల్ మెక్ ఆర్తర్. ఈ రచనపై అప్రకటిత నిషేధాన్ని అమలు చేసాడు. జాన్ హెర్సీ ‘హిరోషిమా’ వెలువడి నేటికి అరవై ఆరేళ్లు. ఒక పెను వినాశానికి కటువైన స్మరణగా, మళ్లా ఎప్పుడూ అణు బాంబుద్వారా జన హననం జరగకూడదనే సంకల్పంతో దేశ దేశాల ప్రజలు, తమ ప్రభుత్వాలను నిలదీయాలిసన అవసరం అప్పటికన్నా ఇప్పుడు ఎంతో ఎక్కువగా వున్నది. అందుకే హిరోషిమా, నాగసాకి నగరాలలో ఆహుతైపోయిన సామాన్య ప్రజలకు నివాళిగా, అణ్వాయుధ వ్యతిరేక శాంతి సంఘీభావ ప్రకటనగా, జాన్ హెర్సీ స్మృతికి అభినందనగా మనం సంకల్పం చేసుకోవాల్సిన తరుణం ఇది. ఈయన మార్చి 24, 1993 సంవత్సరంలో కన్నుమూశాడు. ఆ సందర్భంలో ‘ది న్యూయార్కర్’ పత్రిక తన నివాళిలో ‘ఎన్నో పత్రికలు, ఇతర మాధ్యమాలు చెప్పి చెప్పి అరగదీసిన ‘హిరోషిమా’పై అణుబాంబు దాడి గురించి, అత్యంత తాజా కథనంగా, ఉత్తమ పాత్రికేయ నిబద్ధతతో తన రచన చేసిన ఉన్నత జర్నలిస్ట్‌గా జాన్ హెర్సీని నుతించి తమ గౌరవాన్ని తెలిపింది. ‘హిరోషిమాలు ఇక వద్దు’ అని బలమైన అవగాహనకు రావడమే మనందరి కర్తవ్యం.

No comments:

Post a Comment