Friday, 17 August 2012

మరో హరిత విప్లవం.. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి..


పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తుల అవసరాలను తీర్చాలన్నా, కొనసాగుతున్న రైతుల సంక్షోభాన్ని పరిష్కరించాలన్నా 'మరో హరిత విప్లవం' రావాలని, ఇది తప్పదని 'ప్రపంచీకరణ సమర్థకులు' ప్రచారం చేస్తున్నారు. దీనిని 'రెండో హరిత విప్లవం'గా లేక 'శాశ్వత హరిత విప్లవం'గా పిలుస్తున్నారు. ఇది ఎలా సాధించబడుతుందో స్పష్టంగా తెలపనప్పటికీ వ్యవసాయరంగ కార్పొరేటీకరణ ద్వారా రావాలని వీరు ఆకాంక్షిస్తున్నారు. ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాలు రైతుల్ని దుర్భిక్ష పరిస్థితుల్లోకి నెట్టి, వారి బతుకుల్ని అతలాకుతలం చేస్తున్నాయి. నిరంతరం కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2011 మార్చి నాటికి దాదాపు 2.68 లక్షల మంది రైతులు ఇలా ఆత్మహత్యలకు పాల్పడ్డారని అధికార గణాంకాలే తెలుపుతున్నాయి. అయినా, పాలకులు చలించడం లేదు. సంక్షోభకారక విధానాలను పునరాలోచించి, మార్చడం లేదు. ఈ పరిణామాలు స్వాతంత్య్ర పోరాటస్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకు అనుగుణంగా లేవని ఎంతోమంది మేధావులు విమర్శిస్తున్నా, వీటిని వేగంగా అమలుపరచిన వారిని ఎన్నికల్లో ఓడిస్తున్నా, వీటి సమర్థకులు పట్టించుకోవడం లేదు. పైగా, సంక్షోభకారక విధానాలను మరింత జాగ్రత్తతో మభ్యపూర్వకంగా రూపొందించి, అమలుచేస్తున్నారు. ఇలా వస్తున్నవే 'కంపెనీ, కాంట్రాక్టు సేద్యాలు'. స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ కాలంలో అమలుచేసిన, చేస్తున్న సాంకేతికాలు, పద్ధతులు, స్వాతంత్య్ర పోరాటస్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకి విరుద్ధంగా వున్నాయి. రాగల దుష్పరిణామాలను 'రైతు విత్తనహక్కుల వేదిక - ఆంధ్రప్రదేశ్‌' సంయుక్త కన్వీనర్‌ ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు సహకారంతో సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞాన వీచిక'.
''వలసపాలన నశించాలి.. విదేశీ (బ్రిటీష్‌) పాలకులారా! మా దేశం విడిచి వెళ్లండి. మా దేశాన్ని మేమే పాలించుకుంటాం. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌... స్వాతంత్య్రం వర్థిల్లాలి.. స్వాతంత్య్రం మా జన్మహక్కు'' ఇదీ ఆనాటి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి. ఈ పోరాటంలో 'దున్నేవాడికే భూమి' అనే నినాదం ముందుకొచ్చింది. ఆనాటి కాంగ్రెస్‌ దీనికను గుణంగా ఓ తీర్మానాన్ని కూడా చేసింది. కానీ, గత రెండు దశాబ్దాలుగా అమలు చేస్తున్న సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలు ఈ స్ఫూర్తిని వమ్ముచేస్తున్నాయి.
స్వాతంత్య్రం తర్వాత తెచ్చిన భూసంస్కరణల్లో జమిందారీ, ఇనాందారీ వంటి మధ్యదళారీ వ్యవస్థ సంబంధాలు నిర్మూలించబడ్డాయి. దున్నేవానికి భూమి అందక పోయినా కొంతమేర భూ వికేంద్రీకరణ జరిగింది. ఇది ఉత్పత్తి పెరుగుదలకు దోహదపడింది.
రూపొందించిన అధిక దిగుబడి వంగడాలు, విస్తరించిన సాగునీటి సౌకర్యాలు, పరిశోధన, విస్తరణ సేవల మద్దతు, అవసర ప్రాతిపదికన చేపట్టిన పరిమిత యాంత్రీకరణ, రుణ సౌకర్యం, కనీస మద్దతు ధరల రూపంలో మార్కెట్‌ మద్దతు, ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోళ్లు వ్యవసాయోత్పత్తి పెరుగుదలకు దోహదపడ్డాయి. ఇవన్నీ ప్రభుత్వ సంస్థల ద్వారా కొనసాగాయి. ఈ పెరుగుదలనే 'హరిత విప్లవం'గా పిలుస్తున్నాం.
ఈ కాలంలో ఉత్పత్తి పెరుగుదల అన్ని ప్రాంతాల్లో ఒకేలా లేదు. సాగునీటి వసతి గల చోటే బాగా ఉంది. ఇది వేరే విషయం - అధిక దిగుబడి వంగడాల నుండి రైతులు సొంత విత్తనాల్ని తయారుచేసుకుని, వాడుకునేవారు. ఇవన్నీ సమిష్టిగా మొదటి హరిత విప్లవానికి కారకాలుగా కొనసాగాయి.
పెరుగుదల స్తబ్ధత...
అయితే, సాంకేతికాల అమలులో ముఖ్యంగా, పోషక యాజమాన్యం, సస్యరక్షణ అమలులో, ఉపకరణాలను సమయానుకూలంగా అందించే వ్యవస్థలో లోపాలు జరిగాయి. ఈ లోపాలు ఉత్పాదకతను పెంచడానికి అవరోధంగా మారాయి. స్తబ్ధత ఆవిర్భవించింది. కానీ, 1980 దశకంలో పెరిగిన ఉత్పత్తి ప్రధానంగా అన్నిరకాల ఉపకరణాల వినియోగాన్ని పెంచడం ద్వారా సాధ్యపడింది. ఫలితంగా, వీటి వినియోగ సామర్థ్యం తగ్గింది, ఖర్చులు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే సరళీకరణ, ప్రపంచీకరణ విధానాల అమలు ప్రారంభమైంది.
వ్యవసాయ కార్పొరేటీకరణ...
చిన్న కమతాలు వ్యవసాయ కార్పొరేటీకరణకు ఆటంకమని, ఖర్చుతో కూడిన కొత్త సాంకేతికాలను ఇవి ఇముడ్చుకోలేవని పాలకులు భావిస్తున్నారు. అలా ప్రచారమూ చేస్తున్నారు. ఈ విషయంలో జపాన్‌, చైనాలాంటి దేశాల అనుభవాలను పరిగణలోకి తీసుకోవడం లేదు.
వ్యవసాయ కార్పొరేటీకరణకు 2000 ప్రాంతంలో విడుదల చేసిన ద్రవ్య వినియోగ సంస్కరణల నివేదిక నాలుగు మార్గాల్ని సూచించింది. దీనిలో కౌలుకు భూముల్ని తీసుకునే జాయింట్‌ స్టాక్‌ కంపెనీ నమూనాను చిత్తూరుజిల్లా కుప్పం వద్ద భారీ ఖర్చుతో అమలుచేశారు. రైతులకు కంపెనీ కౌలు చెల్లించలేకపోయింది. ప్రభుత్వమే చెల్లించాల్సి వచ్చింది. ఇది పూర్తిగా విఫలమైంది. రెండో నమూనాలో జాయింట్‌ స్టాక్‌ కంపెనీ సేద్యాన్ని సహకార సేద్యం పేరుతో అమలుచేయ ప్రయ త్నించింది. కంపెనీకి ఇచ్చిన భూములకు బదులుగా రైతులు షేర్ల సర్టిఫికెట్లను పొందాలి. కంపెనీ పిలిచినప్పుడే కూలి పనికి పోవాలి. లాభాల్ని చూపిస్తే షేర్లకను గుణంగా రైతులకు ఆదాయం వస్తుంది. దీనిలో వాస్తవాలను గ్రహించిన రైతులు ఈ నమూనాను ప్రారంభానికి ముందే తిరస్కరించారు. ఫలితంగా కాంట్రాక్టు సేద్యాన్ని ఇప్పుడు ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది. దీనికోసం చట్టబద్ధమైన ఏర్పాట్లను చేస్తోంది. కార్పొరేటీకరణ వల్ల రైతులు కొత్తరకం బానిసలుగా మారతారు.
కాంట్రాక్టు సేద్యం.. దుష్ప్రభావాలు...
మన రాష్ట్రంలోనే కోళ్ల పెంపకంలో అమలుచేసిన కాంట్రాక్టు సేద్యం చిన్న ఉత్పత్తిదారుల్ని పూర్తిగా కనుమరుగు చేసింది. కోళ్ల ఉత్పత్తిరంగం పూర్తిగా కంపెనీల వశమైంది. వృత్తి కోల్పోయిన రైతులు ఇతర రంగాల్లోకి మళ్లాల్సి వచ్చింది. దీనిలో ఇప్పుడు కేవలం కూలీలు పనిచేస్తున్నారు. ఇదే నమూనాను వ్యవసాయరంగానికి పూర్తిగా విస్తరిస్తే రానున్న పరిణామాలు భయంకరంగా వుంటాయి. చిన్న ఉత్పత్తిదారులు కొన్ని పంటల్లోనే కనుమరుగవుతారని పౌల్ట్రీ కాంట్రాక్టు పెంపకం నిర్ద్వందంగా నిరూపిస్తుంది.
ఇపుడు అమలవుతున్న కాంట్రాక్టు సేద్యం పూర్తిగా అసమానతలతో కూడినది. కాంట్రాక్టు కంపెనీలకి ఏ అర్హతా అవసరం లేదు. కేవలం రిజిస్ట్రేషన్‌, కొంత పెట్టుబడి వుంటే చాలు. ఇంతా చేస్తే, కాంట్రాక్టు ఉత్పత్తిని తప్పనిసరిగా కొనాల్సిన నిబంధన లేదు. ఏదో పేరుతో కొనకుండా తప్పించుకునే అవకాశం కంపెనీలకు కల్పించబడింది. అసలు రాతపూర్వక ఒప్పందాలు లేకుండానే 90 శాతం కమతాల్లో ఈ సేద్యం కొనసాగుతోంది. ఏ చట్టమూ, నియమమూ నిర్దేశించిన విధంగా అమలుకావడం లేదు.
కూరగాయ రైతుల అనుభవాలు..
రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు, పాల ఉత్పత్తిని చిన్న రైతులే చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలంలో రెండు గ్రామాలను ఈ నెల 10వ తేదీన పరిశీలించడం జరిగింది. వీరంతా మిశ్రమ సేద్యం చేస్తున్నారు. నీటి లభ్యతను బట్టి వరి, ఆ తర్వాత కూరగాయలు (ఎక్కువగా ఆకుకూరలు), పాడి పశువుల్ని పెంచుతున్నారు. రెండెకరాలలోపు రైతులు కూడా తమ శ్రమతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పిల్లల చదువు, ఆరోగ్యం ఖర్చులకు ఇబ్బందులు పడుతు న్నారు. నీటి లభ్యతకు అనుగుణంగా (బోరుబావులు, భూగర్భజల వనరు, కరెంటు సరఫరా) తమ సేద్యాన్ని ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకోగలుగుతున్నారు. బీమా పథకం సాయం లేకున్నా సేద్యంలో రిస్క్‌ను తమదైన పద్ధతిలో తట్టుకోగలుగు తున్నారు. ఈ గ్రామాల్లో కూరగాయల కాంట్రాక్టు సేద్యాన్ని ప్రవేశపెడితే ఇలా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడం సాధ్యం కాదు.
ఈ రైతుల ఆదాయం ప్రధానంగా అమ్మే సమయంలో ఉత్పత్తికి గిట్టే ధర మీద ఆధారపడుతుంది. కాంట్రాక్టు ఉత్పత్తిలో ఒకవేళ కంపెనీ కొనకపోతే రైతులు బాగా నష్టపోవాల్సి వస్తుంది. తక్షణం ప్రత్యామ్నాయ మార్కెట్‌లో తక్కువ ధరకే అమ్మాల్సి వస్తోంది (అమ్ముడుపోతే). ఈ కంపెనీల స్థానంలో ఉత్పత్తిదారుల సహకార, సేవా, మార్కెట్‌ సంఘాలు లేదా రైతుల కంపెనీల ఆధ్వర్యంలో ఉత్పత్తి కొనసాగితే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సుస్థిర ఉత్పత్తి పద్ధతుల ద్వారా మిశ్రమ ఉత్పత్తిని కొనసాగించవచ్చు. ఇదే ప్రయివేటు కంపెనీల కాంట్రాక్టు సేద్యంలో సాధ్యం కాదు.
సరళీకరణ కాలంలో..
హరిత విప్లవ కాలంలో రైతులకు మద్దతుగా ఏర్పర్చిన అన్నిరకాల ప్రభుత్వవ్యవస్థలు క్రమంగా క్షీణింపజేయబడ్డాయి. వీటన్నింటిలో ప్రయివేటు సంస్థల పాత్ర పెంచబడింది.ప్రయివేటు కంపెనీలు విత్తనోత్పత్తి, సరఫరా లపై కేంద్రీకరించాయి. అధిక దిగుబడి వంగడాలకు బదులు లాభాల్నిచ్చే హైబ్రిడ్‌ విత్తన సరఫరాపై కేంద్రీకరించాయి. తద్వారా వ్యవసాయోత్పత్తిలో వినియోగించే అన్ని సాంకేతికాలను ప్రభావితం చేయగలుగుతున్నాయి. రైతుల్ని తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సబ్సిడీతో విత్తనాలను అందిస్తూ సొంత విత్తనం బదులు కొని, వాడేలా ప్రభుత్వం అలవాటు చేసింది, చేస్తోంది. ఫలితంగా, విత్తనమార్పిడి రాష్ట్రంలో ఇప్పుడు 75 శాతానికి చేరింది. దీన్ని నూరు శాతానికి పెంచే కార్యక్రమాన్ని చేపట్టింది. తరగిపోతున్న ప్రభుత్వ పరిశోధనలు, విస్తరణ సేవల మద్దతు, మార్కెట్‌ జోక్యం, రైతులపై ప్రయివేటు కంపెనీలు, పెట్టుబడి దారుల, బహుళజాతి పట్టును ద్విగుణీకృతం చేశాయి. కొనేటప్పుడు, అమ్మేటప్పుడు రైతులు నష్టా లకు గురవుతున్నారు. పెట్టిన ఖర్చులను పూర్తిగా రాబట్టుకోలేక, పెరుగుతున్న కుటుంబఖర్చులకు అనుగుణంగా ఆదాయాన్ని పెంచుకోలేక రైతులు రుణభారాల్లో పడిపోయారు. సబ్సిడీల్ని (ముఖ్యంగా ఎరువులు, సాగునీరు) తగ్గిస్తూ ప్రభుత్వమే అన్ని ఉపకరణాల రేట్లను పెంచుతోంది. రుణ సౌకర్యాన్ని పెంచుతున్నామని చెప్తున్నా, రుణభారాల్లో వున్న రైతులకు రుణపెంపు పరిష్కారం కాదు. రుణ భారంలో మునిగిపోయిన రైతులు వాస్తవాల్ని గుర్తించలేక, ఒకవిధమైన మభ్య ప్రపంచంలోకి నిస్సహాయులుగా నెట్టబడుతున్నారు. కంపెనీలు, కాంట్రాక్టు సేద్యమే తమ సమస్యలకు పరిష్కారమనే భ్రమల్ని రైతుల్లో ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కానీ, ఎంతోమంది రైతులు దీనిని అంగీకరించడం లేదు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆదుకోవాల్సిన పంటల బీమా రైతులు ఆకాంక్షిస్తున్న విధంగా ఉపయోగపడటం లేదు. ఈ పరిణామాలన్నీ రైతుల జీవితాల్ని ధ్వంసం చేస్తున్నాయి. ఇవన్నీ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకి విరుద్ధమైనవే.

No comments:

Post a Comment