Sunday, 21 October 2012

'వాస్తు' శాస్త్రం కాదు.. ఎందుకని? (3)


'ఇక భూమి రకరకాల ధ్వనులు చేస్తుందట. వాటిలో ''హయేభ, వేణు వీణాబ్ది దుందుభి ధ్వని సంయుతా'' అని 'మయమతం' పేర్కొంటోంది. అంటే గుర్రము, ఏనుగు, వెదురు, వీణ, సముద్రము, భేరి ఈ ధ్వను చేసే భూమి శ్రేష్టమైందట. భూమి, గుర్రం ధ్వని, ఏనుగుల ధ్వని ఎలా చేస్తుందో నీకేమైనా అర్థమైందా?'' అని అడిగాను.
''అలాంటి ధ్వనులు చేసే భూమి ఎలా ఉంటుందో నాకర్థంకావడం లేదు'' అన్నాడు చంద్రమౌళి.
''భూమి ఆకారంతో ఎలా మంచి, చెడు కలుగుతుందో విను.''
''వ్యజనేవిత్తనాశస్యాత్‌'' అని 'రాజమార్తాండం' చెబుతోంది. అంటే 'విసనకర్ర ఆకారంగల భూమి ధననాశనమును కలగజేస్తుంద'ట. అలాగే 'విశ్వకర్మ ప్రకాశిక' ఏం చెబుతోందంటే 'సింహాభా సుగుణాన్‌ పుత్రాన్‌, వృషాభా పశువృద్ధిదా||' అంటే 'సింహాకారముగానున్న భూమి సుగుణవంతులగు పుత్రుల్ని కలిగిస్తుందట! ఎద్దు ఆకారముగా వున్న భూమి పశువృద్ధిని కల్గించును'' అని అర్థం. అలాగే
శ్లో|| సూకరోష్ట్రాజ సదృశీ ధనుః పరశురూపిణీ
కుచేలాన్మలిన్మార్భాన్‌ బ్రహ్మఘ్నాన్జనయేత్సుతాన్‌''
అని కూడ విశ్వకర్మ ప్రకాశిక చెబుతోంది. అంటే
''గృహము నిర్మించనున్న భూమి పంది, ఒంటె, మేక, బాణము, గండ్రగొడ్డలి ఆకారములలో ఏ ఆకారముగా వున్నా దరిద్రులు, మలినమైనవారు, మూర్ఖులు, బ్రహ్మహత్యాతత్పరులైన పుత్రులు కలుగుతారు'' అని అర్థం. భూమి సింహం, ఎద్దు, పంది, మేక.. వంటి ఆకారాలలో ఎలా ఉంటుంది? వీటిలో సింహం, ఎద్దు ఆకారాలు మంచివట. పంది, మేక ఆకారాలు చెడ్డవట! ఒక స్థలం ఎద్దు ఆకారంలో ఉందా? మేక ఆకారంలో ఉందా? అని తేడా ఎలా తెలుసుకుంటారు?' అని ప్రశ్నించాను.
చంద్రమౌళి సమాధానం మౌనమే.
''ఇంకో విషయం. వాస్తువాదులు గృహము నిర్మించనున్న స్థలములో ఏ దిక్కున, ఏ జంతువు ఎముకలుండేదీ, ఆ స్థలము దగ్గరకు పోకుండానే చెబుతారు తెలుసా?''
''అదెలా చెప్పగలరు?''
''అదే విచిత్రం! ఒక వ్యక్తి వాస్తువాది దగ్గరకు వెళ్ళి, తూర్పు దిక్కుగా కూర్చొని, 'అయ్యా! నేను ఇల్లు కట్టుకోబోతున్నాను. శంకుస్థాపనకు ముహూర్తం పెట్టండి!' అని అడిగాడనుకో. అతను అడిగిన ప్రశ్న ఏ అక్షరంతో ప్రారంభమయింది?''
''అ అనే అక్షరంతో'' అన్నాడు చంద్రమౌళి.
''దానిని గూర్చి'' జ్యోతిస్సంహితార్ణవం'' ఏంచెబుతోందో తెలుసా?
శ్లో|| అవర్గోచ్చారితే ప్రశ్నే ప్రాచ్యాందిశి సమాదిశేత్‌|
గోశల్యం వృషశల్యం స్యాద్ద్విహస్తాచ్చ ప్రమాణతః||
అంటే ''ప్రశ్న యొక్క మొదటి అక్షరం 'అ నుండి ఔ' అక్షరములలో ఒక అక్షరం అయితే ప్రశ్న వేసిన వ్యక్తి స్థలంలో తూర్పుదిక్కులో రెండు హస్తములలోతున ఆవు ఎముకలుగానీ, ఎద్దు ఎముకలుగానీ ఉంటాయి అని అర్థం.''
''అదేమిటి? గృహ నిర్మాత వేసే ప్రశ్న యొక్క మొదటి అక్షరం సహాయంతో అతని స్థలంలో రెండు అడుగుల లోతున ఉండే ఎముకలను కనుగొనడం ఎలా సాధ్యం? ఇది శాస్త్రీయంగా రుజువుపర్చలేని విషయం కదా?'' ఆశ్చర్యంతో అన్నాడు చంద్రమౌళి.
''అప్పుడే ఆశ్చర్యపోకు. ఇంకా విను. ''జ్యోతిస్సంహితార్ణవం'' ప్రకా రం ప్రశ్న మొదటి అక్షరం క, ఖ, గ, ఘ లలో ఒకటైతే, స్థలంలో ఆగేయ దిశలో ఒక హస్తం లోతున పిల్లి ఎముకలుగానీ, మేక ఎముకలుగానీ ఉంటాయట! అలాగే ఇతర అక్షరాలకీ వివిధ జంతువుల ఎముకలు ఉండటానికి సంబంధం ఉంటుందట! ఈ అధ్యాయం చివరలో ఏం చెప్పబడిందంటే.. ''బ్రహ్మోక్తత్వాన్న సంశయః'' అని. అంటే ఈశల్యోద్ధార ప్రకరణము ''బ్రహ్మదేవునిచే చెప్పబడినందున సంశ యములేదు' అని అర్థం. ఆ ప్రకారంగా తాముచెప్పే అనేక అసంబద్ధ విషయాలను దేవుళ్ళ పేర్లతో ముడి పెట్టడం తరచుగా జరుగుతోంది. ఇదీ మనం, సైన్సు వాదులం గమనించవలసిన విషయం.''
మరో విచిత్ర విషయం విను. ఇల్లు కట్టే వ్యక్తి వాస్తు వాదిని ప్రశ్నించేటప్పుడు తన శరీరంలో ఏ అవయ వాన్ని తాకితే లేక ఏ అవయవంలో దురదపుట్టి గోకితే ఏం లభిస్తుందో వాస్తు గ్రంథాలలో చెప్ప బడింది. ఆ విషయాలు విను. దానికంటే ముందు గృహం నిర్మించే స్థలంలో వాస్తు పురుషుడు ఎలా ఉంటాడో ఆ వివరం చెప్పబడింది. అది ముందుగా వివరిస్తాను.'' అని ఒక బొమ్మ చూపించాను.
(ఆ వివరాలు వచ్చేవారం)

No comments:

Post a Comment