Tuesday, 23 October 2012

చీకటి రోజులు

 
 
కరెంట్ లేని ప్రపంచాన్ని ఊహించడం అన్న ఆలోచనే భయానకం. మనిషి జీవితం అంతగా విద్యుత్‌తో పెనవేసుకుపోయింది. మనిషి బతుకు ఇప్పుడు కేవలం ప్రాణ
వాయువు ఒక్కటే ఆధారం కాదు, కరెంటు కూడా అంటే గొప్పగా ఆశ్చర్యపడాల్సినదేమీ లేదు. ఇంటి కాలింగ్ బెల్ నుంచి, బాత్‌రూమ్‌లో గీజర్ వరకు, వంటిల్లు, పడకిల్లు అని లేకుండా అన్నీ విద్యుత్ అవసరాలకు మూలమే. అమెరికాలో కొన్ని నిమిషాలు కరెంట్ పోతే సమస్త జన జీవనం స్తంభించిపోయిందట! అని చాన్నాళ్ల క్రితం జనం ఆశ్చర్యంగా చెప్పుకున్న సంగతి ఇప్పుడు మన దేశానికి వర్తిస్తోంది. కరెంట్ అవసరాలు ఎంతగా
పెరిగాయో, కోతలూ అంతకంతకూ పెరుగుతున్నాయి.
అరవై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ప్రతి పల్లెకు,
పరిశ్రమకు ఇరవై నాలుగు గంటలు ఎడతెగకుండా విద్యుత్
సరఫరా చేయలేకపోతున్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్‌గా పేరొందిన
రాష్ట్రం ఇప్పుడు అంధేరాప్రదేశ్‌గా పేరు తెచ్చుకుంటోంది.
భారతదేశ ధాన్యాగారంగా పేరొందిన రాష్ట్రం సేద్యానికి కావలసినంత విద్యుత్‌ను రైతులకు అందించలేకపోతోంది. ముందు
చూపుతో ప్రణాళికలు రూపొందించే పాలకుల కొరత, అధికారుల అలక్ష్యం వెరశి అటు పట్నాలు, ఇటు పల్లెలు చీకటి రాజ్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి. తిమిరంతో సమరం చేస్తున్నాయి.
ప్రతి ఒక్కరూ కరెంట్‌గత జీవులైపోయారు. ఏ పని చేయాలన్నా కరెంట్ అవసరం. అది సమయానికి ఉండదు. ఉంటే లోఓల్టేజీ. కరెంట్ ఉంది కదా అని పని మొదలుపెడితే అంతలోనే పోతుంది. ప్రాణం పోకడ గురించి వైద్యులైనా చెప్పగలరేమోగాని కరెంట్ నిలకడ గురించి చెప్పగలవారెవరూ లేరు. ఘన, ద్రవ, వాయు పదార్థాలు ఏవీ కూడా కరెంట్ ఉత్పత్తికి తోడ్పడని పరిస్థితి. బొగ్గు కొరత, అనావృష్టి, గ్యాస్ కోత ఇవన్నీ కలసి అగమ్యగోచరమైన పరిస్థితిలోకి నెట్టాయి. ప్రభుత్వాల అధినేతలు, అధికారులు కరెంట్‌తో పరాచికాలు ఆడిన ఫలితం ఇప్పుడు జనానికి ‘కోతల’ రూపంలో షాక్ కొడుతోంది. సకాలంలో వర్షాలు లేకపోవడం తదితర కారణాల వల్ల జలవిద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితి ఏమీ బాగాలేదు. బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు కూడా వివిధ సమస్యలతో సతమతమవుతున్నాయి. బొగ్గు ధరలు పెరుగుతుండడంతో ఆ మేరకు వినియోగదారునిపై భారం వేయాల్సి వస్తోంది. మరోపక్క రావాల్సిన మేరకు బొగ్గు రావడం లేదు. గత ఏడాది, ఈ ఏడాది కూడా మహానది బొగ్గు గనుల నుంచి రావాల్సిన దాంట్లో సగం బొగ్గు కూడా రాలేదు. దానా దీనా వివిధ మార్గాల ద్వారా అందే విద్యుత్ తొమ్మిది వేల మెగావాట్లకు కాస్త అటు ఇటుగా ఉంటోంది. కానీ వేసవి లాంటి కీలక సీజన్‌లో కావాల్సిన విద్యుత్ కనీసం 12వేల మెగావాట్ల నుంచి 13వేల మెగావాట్ల వరకు ఉంటుంది. అంటే దీన్నిబట్టి లోటు అంచనా వేసుకోవచ్చు. కెజి బేసిన్‌లో ఆశించిన మేర ఉత్పత్తి జరగకపోవడం, వివిధ రాష్ట్రాలకు తరలింపుల వల్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ నామమాత్రంగా మారింది. ఇప్పుడు రాష్ట్రంలో సగటు విద్యుత్ లోటు 45 మిలియన్ యూనిట్లు. ఈ మాత్రానికే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఫిబ్రవరి నుంచి మే మధ్య కాలంలో ఉండే 100-120 మిలియన్ యూనిట్ల లోటును భర్తీ చేయడం ఎలా?
మామూలుగా వేసవిలో కోతలు సర్వసాధారణం. గత రెండేళ్లుగా ‘్భరీ’ పరిశ్రమలకు విద్యుత్ కోతలు అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం పరిశ్రమలకు పవర్ హాలీడే అమలవుతోంది. దాంతో కొన్ని పరిశ్రమలు పాక్షికంగా, ఇంకా కొన్ని పూర్తిగా మూతపడుతున్నాయి. దానివల్ల దినసరి ఉత్పత్తి నష్టం రూ.248 కోట్లు. భారీ పరిశ్రమలకు పవర్ హాలిడే వల్ల నెలలో సగం అంటే 16 రోజులు కోత విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భారీ పరిశ్రమలు, లఘుపరిశ్రమలే కాదు ఒకటి, రెండు పవర్‌లూమ్‌లు నిర్వహిస్తున్న నేత కార్మికులపై కూడా దాని ప్రభావం పడింది. దానికి తోడు విద్యుత్ చార్జీలు పెరగడం వల్ల పవర్‌లూమ్‌లు కుంటుపడ్డాయి. గడచిన దశాబ్దకాలంగా రాష్ట్రంలో పరిశ్రమల విద్యుత్ వినియోగం బాగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్భ్రావృద్ధికి పరిశ్రమలు కీలకం. ఈ రంగంలో విద్యుత్ వినియోగం ప్రయోజనకరమే. పదేళ్ల కిందట ఏడువేల మిలియన్ యూనిట్లున్న వినియోగం ఇప్పుడు 20వేల మిలియన్ యూనిట్లకు పెరిగింది. అయినప్పటికీ మొత్తం విద్యుత్ వినియోగంలో పరిశ్రమల వాటా ముప్పై శాతానికి మించడం లేదు. అదే పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగే గుజరాత్ పరిశ్రమల్లో విద్యుత్ వినియోగం 40 శాతం వరకు ఉంది. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా అంతే. పరిశ్రమలతో పాటు రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్లులు, లైఫ్ సేవింగ్ డ్రగ్స్, విత్తన ప్రాసెసింగ్ యూనిట్లకు వారానికి మూడు రోజులు లేదా నెలకు ఎనిమిది రోజులు పవర్ హాలిడే ప్రకటించారు. ఇక పౌల్ట్రీ, రైస్‌మిల్లులు, కోల్డ్‌స్టోరేజీలకు 40శాతం విద్యుత్ కోత అమలు చేస్తున్నారు. వ్యవసాయం, సింగరేణి, తాగునీరు, ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వే ట్రాక్షన్, డిఫెన్స్‌లకు మినహాయింపు ఇచ్చారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆసుపత్రులకు కూడా విద్యుత్ సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే అధికారికంగా కోతలు విధించిన సమయాల్లోనూ కొన్ని ప్రాంతాలలో కిందిస్థాయి సిబ్బంది సహాయ సహకారాలతో విద్యుత్ చౌర్యం జరుగుతోంది. ఇది విద్యుత్ పంపిణీ సంస్థల ఆదాయాన్ని దెబ్బతీస్తోంది.
రాష్ట్రప్రజలు అటు కరెంటు కోతలకు, ఇటు ప్రభుత్వాల వాతలకు అలవాటు పడ్డారు. డిస్కంలు తరచుగా పెంచుతున్న విద్యుత్ చార్జీలను భరిస్తూనే మరొకవైపు వినియోగదారులు ప్రతి సంవత్సరం కరెంట్ కోతలు తప్పవని గ్రహించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్టవ్య్రాప్తంగా చాలామంది వినియోగదారులు ఇప్పటికే ఇన్వర్టర్లను కొనుగోలుచేసి బిగించేసుకున్నారు. గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలలో ‘బీహార్ తరహా పద్ధతి’లో సిటీ జనరేటర్ వ్యవస్థ జోరుగా సాగుతోంది. కొంతమంది వ్యాపారులు సొంతంగా డీజిల్ జనరేటర్లు పెట్టుకుని, వాటి ద్వారా ఇళ్లు, దుకాణాలకు కేబుల్ టీవీ కనెక్షన్లు ఇచ్చినట్లు కరెంట్ కనెక్షన్లు ఇచ్చి విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. బీహార్‌లోని చాలా గ్రామాల్లో కరెంట్ సరఫరా సరిగా ఉండదు. వీధిలో ఎవరైన ఓ మోతుబరి జనరేటర్ ఏర్పాటు చేసుకుని వీధిలోని వారందరికీ కరెంట్ ఇస్తుంటాడు. అందుకు వారు నెలకు ఇంత అని ఇస్తుంటారు. ఇప్పుడు గోదావరి జిల్లావాసులు ఆ పద్ధతికి అలవాటు పడుతున్నారు. ఈ రకంగా ప్రైవేట్ ఆపరేటర్లు , తప్పనిసరి పరిస్థితుల్లో పరిశ్రమల నిర్వాహకులు జనరేటర్లను నడపడం కోసం పెద్ద మొత్తంలో డీజిల్ కొని దేశంలో డీజిల్ వినియోగాన్ని పెంచుతున్నారు.
అధికారం ఉన్నవారిది లేదా అధికారంలో ఉన్నవారిని మెప్పించి పనులు చేయించుకోగలవారిదే రాజ్యం. రాష్ట్రానికి కేంద్రంలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు, మంత్రులు చేతులు ముడుచుకు కూర్చోవడం వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాల మంత్రులు ఆయా రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో పరిధికి మించి ప్రవర్తిస్తున్నారు. మన మంత్రులు మాత్రం అదేదో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు కేంద్రంలో ఇతర రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారు తమ సొంత రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకునేందుకు స్వార్థంతో వ్యవహరిస్తున్నారు. కేంద్రం వద్ద గ్రిడ్ పరిధిలో ఉండే విద్యుత్ నుంచి రాష్ట్రానికి వచ్చే విద్యుత్తుకు కోతపెట్టిన కేంద్ర విద్యుత్ శాఖ సహాయమంత్రి వేణుగోపాల్ 100 మెగావాట్లు తన సొంతరాష్ట్రం కేరళకు తరలించుకుపోతున్నారు. గత సంవత్సరం కేంద్ర గ్రిడ్ నుంచి దక్షిణాదికి ఇచ్చే విద్యుత్‌లో రాష్ట్రం 150 మెగావాట్లు పొందగా ఈ సారి అది బాగా తగ్గిపోయింది. ఈ విధంగా గ్రిడ్ నిర్వహణకు సంబంధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా మొన్నీమధ్య జరిగినట్లు దేశమంతా చీకటిమయం అవుతుంది. గ్రిడ్ పరిధిలోని రాష్ట్రాలు పరిమితికి మించి విద్యుత్‌ను వాడుకోవడం వల్ల వ్యవస్థ విఫలమైంది. గ్రిడ్ పరిధిలో ఎనిమిది రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం ఉన్నా ప్రధానంగా మూడు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లే ఈ పరిస్థితికి కారణమని ఆరోపణలు వచ్చాయి. కొన్ని రాష్ట్రాలు పరిమితికి మించి విద్యుత్‌ను ఉపయోగించుకోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెప్తున్నారు.
రాష్ట్రంలో బొగ్గుతో పాటు గ్యాస్ నిల్వలుండటం సానుకూలాంశం. ప్రస్తుతం 2760 మెగావాట్ల సామర్థ్యంతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. వీటికి 12.97 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ అవసరం కాగా కేంద్రం 9.75 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ మాత్రమే కేటాయించింది. కానీ ఇప్పుడు కేటాయించిన గ్యాస్‌లో కేవలం 32శాతం మాత్రమే సరఫరా అవుతోంది. ఫలితంగా 1,200 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. కొత్తగా ప్రైవేటురంగంలో 3,300 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు సిద్ధమయ్యాయి. వీటితో కలిపి మొత్తం 8,185 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు ప్రతిపాదనలో ఉన్నాయి. అలానే రాష్ట్ర ప్రభుత్వం 2,900 మెగావాట్ల ప్రాజెక్టులకు సిఫార్సు చేసింది. కరీంనగర్, శంకర్‌పల్లి ప్రాజెక్టులు ప్రతిపాదనలో ఉన్నాయి. అన్నీ కలిపితే 70 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ అవసరం. ఇందులో సగం వాస్తవరూపంలోకి వచ్చినా రాష్ట్రం మిగులు విద్యుత్ సాధిస్తుంది. రాష్ట్ర విద్యుత్ ఉత్పాదన సంస్థ ఎపిజెన్‌కో ప్రతిపాదించిన అనేక ప్రాజెక్టులు ఏళ్లతరబడి వెలుగుచూడటం లేదు. రాష్ట్రంలో పరిస్థితి ఘోరంగా ఉందని స్వయంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీలో జరిగిన విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలో వెల్లడించారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2770 మెగావాట్లు ఉన్నా గ్యాస్ కొరత కారణంగా 1600 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం వృథా అవుతోందని, గ్యాస్ సరఫరా లేక 4వేల మెగావాట్ల విద్యుత్ ఆగిపోయిందని చెప్పారు. దాదాపు 22వేల కోట్ల పెట్టుబడి వృథా అయ్యింది. ఢిల్లీ సమావేశంలో మంత్రి ఏకరువు పెట్టిన సమస్యల, కోర్కెల చిట్టా పరిశీలిస్తే పరిస్థితికి కారణం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు, కేటాయింపుల్లో అవకతవకలు, విద్యుత్ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న మంత్రుల పక్షపాత ధోరణి అని అర్థమవుతోంది.
హర్యానాలోని ఎన్‌టిపిసి జజ్జర్ కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న 131 మెగావాట్ల విద్యుత్‌కు తోడుగా కేరళకు తరలివెళ్తున్న 100 మెగావాట్ల విద్యుత్ కూడా మనకి వచ్చినట్లయితే కొరత కొంతవరకు తీరుతుంది. ప్రస్తుతం కొన్ని ఇతర రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కంటే విద్యుత్ లోటు ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో విద్యుత్ కొరత 13 నుంచి 15శాతం మధ్య ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌లోటు సగటున 13.6 శాతం నమోదు కాగా తమిళనాడులో 14.9శాతం, ఉత్తరప్రదేశ్‌లో 14.3శాతం, బీహార్‌లో 14.1శాతం లోటు నమోదైంది. విద్యుత్ పంపిణీలో నష్టాలు కూడా ఈ లోటుకు కారణం. జాతీయ స్థాయిలో విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలు 26-27శాతం ఉన్నాయని ఈ నెల మొదటివారంలో కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వీరప్ప మొయిలీ అన్నారు. విద్యుత్ వినియోగం క్రమశిక్షణతో కూడుకున్న వ్యవహారం. ఏ ఒక్కరు క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరించినా అందరూ ఇబ్బంది పడాల్సిందే. విద్యుత్ ఉత్పాదనను పెంచుకోవడంలో విఫలమైన రాష్ట్రాలు - అవసరాలకోసం పరిమితికి మించి ఇష్టానుసారం విద్యుత్తును ఉపయోగించుకుంటున్న ఫలితమే ఇటీవల విద్యుత్ గ్రిడ్‌లు విఫలం కావడం.
ప్రధాని జోక్యం
విద్యుత్ శాఖ నుంచి హోం శాఖకు బదిలీ అయివెళ్తున్న సుశీల్‌కుమార్ షిండే గ్యాస్ కోతతో రాష్ట్రానికి పెట్టిన వాతనుంచి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తాత్కాలికంగా ఉపశమనం కలిగించారు. 2008లో కెజి బేసిన్‌లో పూర్తిస్థాయిలో గ్యాస్ ఉత్పత్తి అవుతున్న సమయంలో కేంద్ర గ్యాస్ మంత్రిత్వ శాఖ నియమించిన మంత్రివర్గ సాధికారిక కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అడ్డంపెట్టుకుని షిండే ఈ ఆదేశాలు జారీచేసినట్లు చెప్తున్నారు. 2012-13 నాటికి కెజి బేసిన్ ఉత్పత్తి బాగా పెరుగుతుందని అప్పట్లో చేసిన అంచనా ఆధారంగా రత్నగిరి ప్రాజెక్టుకు కొంత గ్యాస్ కేటాయించాలని కమిటీ సిఫార్సు చేసింది. కానీ పరిస్థితిలో మార్పు వచ్చింది. కెజి బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి పడిపోయింది. రాష్ట్రానికి ఇస్తున్న గ్యాస్‌ను మళ్లించారు. ఈ విషయం ముందుగా తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు నిర్ణయం అమలులోకి వచ్చాక ప్రధానమంత్రిని కలిసి మంత్రి జారీచేసిన ఉత్తర్వులను తక్షణం నిలుపుచేసేలా చేశారు. రత్నగిరికి మన రాష్ట్రం వాటా నుంచి గ్యాస్ మళ్లించడం తాత్కాలికంగా నిలిపివేసినా ఆ ప్లాంట్‌కు ఇచ్చిన రసాయన ఎరువుల కంపెనీ హోదా వల్ల మనకు భవిష్యత్‌లో ముప్పు వచ్చే అవకాశం ఉందన్నది విద్యుత్‌రంగ నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం ఇస్తున్న 3.48 ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్‌తో నెలలో తొమ్మిది రోజులు గ్యాస్ ఆధారిత విద్యుత్ సంస్థలు పనిచేయగలవు. ఆ కేటాయింపును 6 యూనిట్లకు పెంచితేనే రాష్ట్రానికి విద్యుత్ కొరత నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెప్తున్నారు.
ధరల భారం
గత ఏడాదిలో మన రాష్ట్రంతో పాటు 19 రాష్ట్రాలు విద్యుత్ చార్జీలను భారీగా పెంచాయి. చార్జీల పెంపుదల సుమారు 37 శాతం ఉంది. అలాఅని విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందా అంటే అదీ లేదు. విద్యుత్ మంత్రిగా ఉన్నప్పుడు సుశీల్‌కుమార్ షిండే సూచించిన విధంగా ఆరు నెలలకు ఒకసారి విద్యుత్ చార్జీలను పెంచేందుకు వేచి ఉండకుండా ఇంధన వ్యయ సర్దుబాటు (ఎఫ్‌ఎస్‌ఎ) పేరిట అదనపు చార్జీలను వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు కోరుతున్నాయి. దానివల్ల వినియోగదారులపైన 5వేల కోట్ల మేర భారం పడుతోంది. అయితే విద్యుత్ సంస్థలకు ఆదాయ లోటు 11వేల కోట్లు ఉండగా దానిలో రూ.6వేల కోట్లు ప్రభుత్వమే భరిస్తోందని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో చిన్నతరహా పరిశ్రమలు రెండు నెలలకు గాను రూ.200 కోట్లు చెల్లించలేమంటే ప్రభుత్వమే ఆ మొత్తాన్ని భరించిందని ఆయన అన్నారు. అసలు చార్జీలతో పోలిస్తే సర్‌చార్జీలు ఎక్కువని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో బొగ్గు, గ్యాస్ ధరలో పెరుగుదల కేవలం 10 నుంచి 15శాతం మాత్రమే ఉంటే సర్‌చార్జి భారం 50 నుంచి 80 శాతం ఎలా ఉంటుందని నిపుణులు విద్యుత్ నియంత్రణ కమిషన్ ఎదుట డిస్కంలను నిలదీశారు. ఒకేసారి మూడేళ్ల సర్‌చార్జ్‌లు వసూలు చేస్తే అసలు చార్జీలను మించిపోతాయన్నారు. సర్‌చార్జ్‌లను ప్రభుత్వమే భరించాలని నిపుణులు సూచించారు. ఎలాంటి హేతుబద్ధత లేకుండా పట్నవాసుల్ని, పల్లెప్రజల్ని ఒకగాటన కట్టి సర్‌చార్జి వసూలు చేస్తున్నారు. వ్యవసాయానికి వాడుకున్న విద్యుత్‌పై పడుతున్న సర్‌చార్జీలను సాధారణ వినియోగదారులపై వేయడాన్ని వారు తప్పుపట్టారు. ‘నెలకు 10 యూనిట్లు మాత్రమే వాడుకునే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ఇలాంటి వినియోగదారులు కనీస చార్జీ కింద రూ.50 చెల్లిస్తారు. అంటే యూనిట్‌కి రూ.5 చొప్పున పడుతోంది. సాధారణంగా మొదటి 50లోపు యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45 మాత్రమే చార్జీ అంటే యూనిట్‌కు రూ.3.55 అదనంగా చెల్లించారు. అది చాలదన్నట్లు సర్‌చార్జ్ వేయడం ఏం న్యాయం?’ అని విద్యుత్ నియంత్రణ కమిషన్ బహిరంగ విచారణకు హాజరైన వారు ప్రశ్నించారు.
పెరుగుతున్న డిమాండ్
జనం అవసరాలకు ప్రతి ఏటా విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఏటా పది శాతం వంతున డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2005-06లో రాష్ట్ర అవసరాలకోసం వినియోగానికి 8,239 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా 2011-12 నాటికి 13,663 మెగావాట్లకు పెరిగింది. డిమాండ్‌కు తగిన విధంగా ప్రతియేటా సరఫరాను పెంచుకుంటూ పోయినప్పటికీ 2012 మార్చిలో పీక్ డిమాండ్ ఉన్నప్పుడు జరిగిన సరఫరా డిమాండ్ కన్నా 2300 మెగావాట్లు తక్కువగా ఉంది. అంటే గడచిన ఆరేళ్ల కాలంలో అధికారంలో ఉన్న పాలకులు, అధికారులు కాస్త ముందు చూపుతో వ్యవహరించి ఉంటే ఈ సరఫరా లోటును అధిగమించడం అసాధ్యంగా మారేది కాదు. జెన్‌కో ప్రతిపాదించిన అనేక ప్రాజెక్టుల్లో కొన్నింటింని టెండరు దశలోనే నిలిపివేశారు. మరికొన్ని వనరుల కొరత వల్ల, ఇంకా కొన్ని బొగ్గు, నీరు లభ్యత లేదని పక్కనపెట్టారు. దాంతో అవి ప్రభుత్వం వారి దస్తాల్లోనే మూలుగుతున్నాయి. విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రైవేట్ సంస్థలు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాకముందే తోక జాడిస్తున్నాయి. గ్యాస్ ధరను పెంచాలని రిలయెన్స్ గత కొంతకాలంగా కేంద్రంపై వత్తిడి తెస్తోంది. అందువల్ల సమీప భవిష్యత్తులో గ్యాస్ ధర పెంచకతప్పదని నిపుణులు చెప్తున్నారు. అప్పుడు విద్యుదుత్పత్తి వ్యయం, యూనిట్ ధర పెరగక తప్పదు. ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులకు సరైన నిర్మాణ కంపెనీలను ఎంపిక చేసుకోకపోవడం కూడా జాప్యానికి దారితీస్తోంది. నిర్మాణ కంపెనీల నిర్లక్ష్యానికి తోడు జెన్‌కో అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం కూడా ఇందుకు కారణం.
గడచిన ఐదేళ్లలో విద్యుత్ లోటు 1494మిలియన్ యూనిట్ల నుంచి 5795 యూనిట్లకు పెరిగింది. విద్యుత్ డిమాండ్ 44శాతం పెరగడం దానికి తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడం వినియోగదారులకు ఇబ్బందికరంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో విద్యుత్ రంగంలో లోటుపాట్లను సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించడం మంచి పరిణామం. అయితే విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు ప్రభుత్వం భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు చేయాలి. విద్యుత్ గ్రిడ్‌లను పటిష్టం చేయడంతో పాటు సురక్షితంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలి. అన్నింటికన్నా ముందు అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు విద్యుత్‌ను ఆదాచేసేందుకు కలసికట్టుగా కృషిచేయాలి. విద్యుత్ ఉత్పత్తిలో, పంపిణీలో, వినియోగంలో సమూల మార్పులు రానంతవరకు పరిస్థితిలో మార్పును ఆశించలేం.
*
రత్నగిరి గొప్పేమిటి?
రత్నగిరి ప్రాజెక్టు కేటాయింపులకు 2008లో బీజం పడింది. 2008లో ప్రణబ్‌ముఖర్జీ నేతృత్వంలో ఏర్పాటుచేసిన మంత్రుల సాధికారక కమిటీ గ్యాస్ కేటాయింపుల్లో ప్రాధాన్యతలను నిర్ణయించింది. అందులో భాగంగానే రత్నగిరి పవర్ ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయించాలని కమిటీ నిర్ణయించింది. ఆ నిర్ణయించడంలో పెట్టిన మెలికవల్లే ఇప్పుడు సమస్య ఉత్పన్నమైంది. గ్యాస్ కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యత ఎరువుల తయారీ యూనిట్లకు, రెండో ప్రాధాన్యత వంటగ్యాస్‌కు, మూడో ప్రాధాన్యత విద్యుత్ ఉత్పత్తి యూనిట్లకు ఇచ్చారు. రత్నగిరి నిజానికి విద్యుత్ ప్లాంట్ అయినా ఎరువుల ప్లాంట్ హోదా కల్పించి గ్యాస్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. రత్నగిరి ప్లాంట్‌కు ఎరువుల ప్లాంట్‌తో సమానంగా ప్రాధాన్యత ఇచ్చి గ్యాస్ సరఫరా చేయాలని అప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ తప్పుపట్టలేదు. కానీ ఇప్పుడది అంతర్రాష్ట్ర సమస్యగా మారింది. కెజి బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి తగ్గడంతో మన వాటాకింద రావాల్సిన గ్యాస్ వాటా తగ్గింది. 80 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేయాల్సిన రిలయెన్స్ కేవలం 51మిలియన్ యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. రత్నగిరి నుంచి వత్తిడి పెరిగినా గత 11 నెలలుగా కేంద్రం దానిని పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్‌కు 3.48 ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్‌ను కేటాయిస్తూ వచ్చారు. ఇప్పుడు ఉత్పత్తి బాగా తగ్గి వత్తిడి ఎక్కువ కావడంతో కేటాయింపు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రెంటుకన్నా కరెంటు చార్జీ ఎక్కువ
రాజధాని నగరంలోని కొన్ని ప్రాంతాలలో సర్‌చార్జీలతో కలిపి అద్దెకన్నా కరెంటు చార్జీ ఎక్కువవుతోంది. అసలే అరకొర ఉపాధితో బతుకీడుస్తున్న బడుగుజీవులు ఈ భారాన్ని మోయలేకపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి రాజధాని చుట్టుపక్కల నివసించే వారు తమ సొంత రాష్ట్రాలకు తరలివెళ్తున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖకు చెందిన డిస్కంలకు ప్రభుత్వం పదివేల కోట్లకు పైగా బకాయి పడింది. దీనిలో దాదాపు రూ.6400కోట్లు 2009 ఎన్నికల సందర్భంగా అదనంగా కొనుగోలు చేసిన విద్యుత్‌కే ఇవ్వాలి. ఆ ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వం గాని, ఆయన తరువాత గద్దెనెక్కిన ముఖ్యమంత్రులు గాని పట్టించుకోలేదు. లెక్కకు రాని విద్యుత్ అంతా సేద్యానికి వాడుతున్నారనే వాదన ఉంది. అంటే తెలంగాణకు చెందిన ఒక జిల్లాలో బిల్లుల లెక్కకు వస్తున్న విద్యుత్ 35శాతం, 15శాతం పంపిణీ నష్టాలను కలిపినట్లయితే అది దాదాపు 50శాతం అవుతుంది. అంటే మిగిలిన సగం సేద్యానికి వాడుతున్నారని అనుకోవాలి. వాస్తవంగా చూస్తే పరిస్థితి అలా లేదు. కావలసినంత విద్యుత్ సరఫరా కావడం లేదని, రాత్రుళ్లు పొలంవద్ద ఉండి సేద్యానికి నీరు పంప్ చేసుకోవాల్సి వస్తోందని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. అనేక చోట్ల సబ్ స్టేషన్లను ముట్టడించినట్లు , అధికారులను నిర్బంధించినట్లు వార్తలు వస్తున్నాయి.

No comments:

Post a Comment