Wednesday 10 October 2012

జీవ భద్రత .. జీవ వైవిధ్యం..


జీవరాశులకు పెద్దఎత్తున నష్టం జరగకుండా నివారించడమే 'జీవభద్రత'. జీవభద్రత ప్రధానంగా జీవావరణం (ఎకాలజీ), మానవారోగ్యంపై కేంద్రీకరిస్తుంది. జీవావరణంలోకి దిగుమతయ్యే జీవరాశులు, వ్యవసాయంలో బయటి నుండి వచ్చే వైరల్‌ లేక మార్పిడికి గురైన జన్యువులు జీవాల్లో అభద్రతను కలిగిస్తాయి. వైద్యరంగంలో ప్రియాన్స్‌గా పిలువబడుతూ పశువుల్లో చికిత్సలేని 'మాడ్‌ కౌ'లాంటి అంటురోగాల్ని కలిగిస్తున్నాయి. బ్యాక్టీరియాలతో కలుషితమైన ఆహారం, వైద్యరంగంలో జీవావరణం నుండి వచ్చిన అంగాలు, కణజాలాలు లేక జన్యు చికిత్స ఉత్పత్తులు, వైరస్‌లు అభద్రతను కలిగిస్తున్నాయి. రసాయనిక కోణంలో నైట్రేట్‌ నత్రజని జీవావరణంలో కలిసినపుడు, పునరుత్పత్తిని ప్రభావితం చేసే ఇతర కారకాలు, కాలుష్య కారకాలు కూడా అభద్రతను కలిగిస్తూ జీవభద్రత పరిధిలోకి వస్తాయి. గ్రహాంతర సూక్ష్మజీవులు ఉంటే అవి అంతరిక్ష శకలాలతో భూమికి చేరి తెలియని సమస్యలు సృష్టిస్తాయని తగిన జాగ్రత్తలు తీసుకోబడుతున్నాయి. ఇవన్నీ విడివిడిగా లేక సంయుక్తంగా జీవవైవిధ్యంపై ప్రభావం కలిగి వున్నాయి. జన్యుమార్పిడి పంటలు, ఉత్పత్తులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జీవభద్రతను కొనసాగించడంలో జీవవైవిధ్యంపై ప్రభావాలను 'ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు' సహకారంతో క్లుప్తంగా తెలుపుతూ మీముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.
జన్యుమార్పిడి సాంకేతికంతో జొప్పించే ఇతర జాతి జన్యువు చొప్పించాల్సిన జాతి జన్యువుల సమూహంలో ఎక్కడ స్థిరపడుతుందో తెలియదు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ ప్రక్రియ చీకటిగదిలో వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎక్కడో ఒక దగ్గర స్థిరపడ్డట్టుగా వుంటుంది. ఇలా ప్రవేశపెట్టబడ్డ జన్యువు ఆక్రమించిన స్థలాన్ని (క్రోమోజోముపై), పరిసరాల్లోని ఇతర జన్యువులను బట్టి బయటికి కనిపించే గుణగణాలు (జీన్‌ ఎక్స్‌ప్రెషన్‌) ఆధారపడి వుంటాయి. వీటన్నింటినీ ముందుగానే తెలుసుకోలేం. అందువల్ల, ఇలాంటి జన్యుమార్పిడి ద్వారా రాగల గుణగణాలను అన్నింటినీ ముందుగానే పరిగణనలోకి తీసు కోలేం. అందువల్ల, జన్యుమార్పిడి ఉత్పత్తుల నుండి జీవభద్రతను కలిగించడానికి తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
జన్యుమార్పిడి సాంకేతికం ద్వారా కొత్తగా సృష్టించబడుతున్న, సృష్టించబోయే జీవకణాలు, రాశులు మానవాళిని నష్టపర్చకుండా జీవభద్రత కోసం నియమ, నిబంధనల్ని రూపొందించుకోవాలి. దీనికోసం అంతర్జాతీయ చర్చలు కొనసాగుతున్నాయి. 'కార్టజినా ప్రొటోకాల్‌ (అంతర్జాతీయ ఒప్పందం)' ఈ చర్చల ఫలితమే.
జీవభద్రతపై 1993 నుండి అమల్లోకి వచ్చిన 'కార్టజినా ప్రొటోకాల్‌' భూగోళంలో జీవవైవిధ్య పరిరక్షణకు ఆధారంగా పనిచేస్తుంది. ఇది పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధిలో భాగంగా 1992 'ఎర్త్‌ సమ్మిట్‌'లో ముందుకొచ్చింది. జీవం కలిగిన జన్యుమార్పిడి జీవులను కొత్త జీవావరణంలో ప్రవేశపెట్టడం వలన రాగల దుష్ప్రరిణామాల్ని ముందుగానే తెలుసుకోలేం కాబట్టి, ముందుజాగ్రత్త చర్యలన్నీ తీసుకోవాలని కార్టజినా ప్రొటోకాల్‌ నిర్దేశిస్తుంది. ఒకవేళ ఇలా కొత్తగా దిగుమతువుతున్న జీవులు అభద్రత కలిగించే అవకాశం వుందని ఏ అభివృద్ధి చెందుతున్న దేశమైనా భావిస్తే అట్టి దిగుమతులను ఆపేసే అధికారాల్ని ఆ దేశం కలిగి వుంది. ఈ ముందుజాగ్రత్త సిద్ధాంతం అభివృద్ధి చెందిన దేశాలకు, ప్రజారోగ్యం, రాగల ఆర్థిక లాభాల మధ్య సమతుల్యత పాటించి, నిర్ణయాలను తీసుకోడానికి వీలు కలిగిస్తుంది. తద్వారా ప్రపంచంలోని జీవవైవిధ్య వనరులను వినియోగించుకోడానికి, జీవం కలిగిన జీవాల అంతర్జాతీయ మార్పిడికి వీలుకలిగిస్తుంది.
ఈ ముందుజాగ్రత్త సిద్ధాంతానికి అనుగుణంగా జన్యుమార్పిడి పంటల ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను జీవావరణంలో ప్రవేశపెట్టినప్పుడు రాగల దుష్ప్రరిణామాల్ని కనిపెట్టడానికి క్షుణ్ణంగా పరిశోధన చేయాలి. ఇలా ఎగుమతయ్యే ప్యాకేజీలపై జన్యుమార్పిడి ఉత్పత్తుల లేబుల్‌ని తప్పనిసరిగా వుంచాలి. ఈ నియమాలు చాలా కఠినంగా వున్నాయని జీవ సాంకేతిక పరిశ్రమ భావిస్తుంది. వీటిని అధిగమించడానికే 'గణనీయమైన సమానత్వ' ప్రాతిపదికను ముందుకు తెచ్చింది.
గణనీయమైన సమానత్వ ప్రాతిపదిక..
'గణనీయమైన సమానత్వ ప్రాతిపదిక' మామూలుగా తినే ఆహారపదార్థాలలో కూడా నష్టం కలిగించే కొన్ని పదార్థాలు సహజంగానే వుండవచ్చని భావిస్తుంది. ఇంతకాలం వీటిని తీసుకుంటున్నప్పటికీ అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. అందువల్ల, జన్యుమార్పిడితో రూపొందించిన కొత్త పదార్థాలు ఇప్పటికే వినియోగంలో వున్న పదార్థాలతో ఎక్కువభాగం సారూప్యత కలిగి ఉన్నప్పుడు, అలా కంపెనీ నిర్ధారించినప్పుడు అట్టి పదార్థాల ప్రభావాలను అంచనా వేసేటప్పుడు అదనంగా రాగల దుష్ప్రభావాలనే పరిగణనలోకి తీసుకోవాలి. అంతేకానీ, జన్యుమార్పిడి ద్వారా రూపొందించిన పదార్థాల ప్రభావాలని తిరిగి పునరంచనా చేయాల్సిన అవసరం లేదని జీవ సాంకేతిక పరిశ్రమ, దాని మద్దతుదారులు వాదించారు. ఈ వాదనతో అమెరికా ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చి, అంగీకరింపజేశారు.
జీవ వైవిధ్యం..
జీవావరణలో జన్యుమార్పిడి పంటలు ఎన్నో మార్పుల్ని తెస్తాయి. అభద్రతను పెంచుతాయి. ముఖ్యంగా ఒకే పంటను, అదీ ఆ పంటలో ఒకటి లేక రెండు జన్యువులు మార్చిన పంటలను ప్రవేశపెట్టి, మాటిమాటికీ పండించడం ద్వారా జీవావరణంలో అస్థిరత్వం పెరుగుతుంది (గత వారం ఈ సమాచారం ఇదే పేజీలో ఇవ్వబడింది). ఇట్టి జీవావరణంలో ఏ చిన్న ఒడుదుడుకులొచ్చినా తట్టుకోలేవు. బయటి నుండి వచ్చే చీడపీడలనూ తట్టుకోలేవు. ఇలాంటి ఒత్తిళ్లను తట్టుకోగల రకాలు రూపొందినప్పుడు (పత్తిలో కాయతొలుచు పురుగు తట్టుకొనే రకం) రైతులు పంట మార్పిడి చేయకుండా అదే పంటను మాటిమాటికీ వేస్తుండడంతో జీవవైవిధ్యం హరించుకుపోతుంది. నేడు పత్తిలో మనం చూస్తున్నది అదే.
ఆరోగ్యంపై ప్రభావం...
బ్రిటిష్‌ శాస్త్రవేత్త 'మైకేల్‌ ఆంటోనియో' ప్రకారం జన్యుమార్పిడి ఆహారం నుండి మూడు, నాలుగురకాల రిస్క్‌లు తలెత్తవచ్చు.
* బయటి నుండి జన్యువును చొప్పించడం వల్ల - ఆ జన్యువు నేరుగా జీవవ్యవస్థలోకి ప్రవేశించవచ్చు. (అంతర్గత బిటి విషాహారంలో జరిగేది ఇదే)
* కొత్తగా ప్రవేశపెట్టిన జన్యు మొక్కల్లో జీవ రసాయనిక మార్పుల్ని తేవొచ్చు - కలుపు మందుల్ని తట్టుకునే రకాల్లో ఎంజైమ్‌ వ్యవస్థలు మారి, ఆరోగ్య సమస్యలను సృష్టించవచ్చు.
* కలుపుమందును తట్టుకునే జన్యుమార్పిడి పంటలతో కలుపుమందుల వినియోగం ఎన్నో రెట్లు పెరిగింది. ఇది జీవావరణంపై దుష్ప్రభావాన్ని కలిగి వుంది.
* జన్యుమార్పిడి ప్రక్రియలు స్వతహాగా మొక్కల్లోని జీవరసాయనిక మార్పుల్ని తెచ్చి, జీవాల్లో కొత్త మార్పులకి దారితీయవచ్చు (మ్యూటాజెనిక్‌ ఎఫెక్ట్స్‌)
దుష్ప్రభావాలపై అధ్యయనం..
జీవ సాంకేతిక పరిశ్రమల వారు ఎక్కువభాగం ఎలుకలకు 90 రోజులు ఆహారాన్ని పెట్టి, ఆరోగ్యభద్రతపై స్వల్పకాల అధ్యయనాలు చేశారు. ఈ ప్రయోగాల్లో ఎక్కువభాగం 30 రోజులకే పరిమితం చేయబడ్డాయి. కలుపు మందును తట్టుకునే జన్యుమార్పిడి మొక్కజొన్నలు ఎలుకలకు పెట్టినప్పుడు వాటి పెరుగుదల తగ్గిపోయింది. ఒకరకం కొవ్వు శాతం పెరిగింది. వాటి కాలేయం, మూత్రపిండాల పని దెబ్బతింది. మరో ప్రయోగంలో బిటి విషాహారాన్ని 90 రోజుల వరకూ ఎలుకలు, కుందేళ్లు, మేకలకు పెట్టారు. అలాగే ఆవులు, కోళ్లు, చేపలకు 42-45 రోజుల వరకే పెట్టారు. ఈ కొద్ది కాలంలోనే బిటి విషాహారం ఈ జంతువుల్లో ఆహారాన్ని తీసుకోవడమే తగ్గించాయి. డయేరియా వచ్చింది, నీళ్లు ఎక్కువగా తీసుకున్నాయి. ఎలుకల్లో కాలేయం, శరీర బరువు తగ్గిపోయింది.
మొత్తం మీద ఈ అధ్యయనాలన్నీ జన్యుమార్పిడి పంటల విషాహారం దుష్ప్రభావాల్ని కలిగిస్తుందని ధృవపరుస్తున్నాయి. కానీ 'గణనీయమైన సమానత్వ సిద్ధాంతం' ఆధారంగా ఈ మార్పుల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని జీవ సాంకేతిక పరిశ్రమల వారు వాదిస్తున్నారు. ఈ మార్పులన్నీ జన్యుమార్పిడి ఉత్పత్తుల ఆరోగ్య ప్రభావాలపై దీర్ఘకాల అధ్యయన అవసరాన్ని సూచిస్తున్నాయి. మన దేశంలో దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయడం లేదు.
స్వతంత్ర పరిశోధనా సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు ఈ జన్యుమార్పిడి ఉత్పత్తుల ప్రభావాలపై అధ్యయనానికి అవకాశాలు దొరకడం లేదు. అయినా, వీరు చేసిన కొన్ని అధ్యయనాల్లో తేలిన విషయాలు...
ష బిటి జన్యుమార్పిడి ఆహారాన్ని మూడుతరాలుగా ఎలుకలకు పెట్టినప్పుడు కాలేయం, మూత్రపిండాల్లో జీవకణాలు చనిపోయినట్లు గుర్తించారు. తర్వాత రక్తంలో కూడా మార్పులు వచ్చాయి.
*ఎలుకల్లో ఈ ఆహారం వల్ల రోగ నిరోధక వ్యవస్థలో మార్పులు వచ్చాయి.
* సైటోకిన్‌ పనివిధానంలో మార్పు వచ్చింది.
* జీర్ణకోశాల్లో వున్న సూక్ష్మజీవుల్లో మార్పులొచ్చాయి. జన్యుమార్పిడి ఆహారం పెట్టినప్పుడు కోలిఫాం బ్యాక్టీరియా 23 శాతం అధికంగా వుంది.
* ఈ మార్పులన్నీ ఉద్దేశించకపోయినప్పటికీ వచ్చాయని, సంబంధిత పరిశోధకులు తెలిపారు
* జీవాల్లో కూడా ఇలాంటి పరిణామాలే కనిపించాయి. ముఖ్యంగా వీటిలో కాలేయం, పిత్తాశయం పనివిధానంలో మార్పులొచ్చాయి.
* జన్యుమార్పిడి పొందిన సోయా వల్ల కుందేళ్ల మూత్రపిండాలు, గుండెలోని ఎంజైమ్‌ పనివిధానంలో తేడాలొచ్చాయి.
జన్యుమార్పిడి పంటల వల్ల ఇన్ని ఆరోగ్య సమస్యలున్నప్పటికీ నిర్ధారించు కోకుండానే మన ఆహారవ్యవస్థలోకి ఈ పంట ఉత్పత్తులు వచ్చేశాయి. ముఖ్యంగా సోయా, మొక్కజొన్న, పత్తి గింజల నూనె, పత్తి చెక్కలో ప్రవేశించాయి. వీటివల్ల మరణాలు వెంటనే సంభవించకపోవచ్చు. కానీ, రాగల అనేక అనారోగ్య సమస్యల మాటేమిటి? ముఖ్యంగా ఎండోక్రైన్‌ గ్రంథులకు సంబంధించిన మధుమేహం వంటి ఆరోగ్యసమస్యల మాటేమిటి?
బిటి విషం..
బిటి విషం అనేది ఒక 'స్ఫటిక ప్రొటీన్‌'. ఇది సహజంగా భూమిలో వుండే బ్యాక్టీరియా (బాసిల్లస్‌ తురంజినిసిస్‌) లో ఉంటుంది. అయితే, వీటిలో కొన్ని రకాలు మాత్రమే విష ప్రభావం కలిగి వున్నాయి. వాటినే సస్యరక్షణ మందుగా వినియోగించారు. ప్రకృతిపరంగా, స్థానికంగా వుండే బిటి స్పటిక పదార్థం సస్యరక్షణకు ఉపయోగపడదు. కానీ, కొన్ని కీటకాల జీర్ణకోశంలో ఈ ప్రొటీన్‌ విడుదలవ్వగానే కొన్ని మార్పులొస్తాయి. ఇలా విడుదలైన ప్రొటీనే విష గుణం కలిగి వుంటుంది. ఇలా జీర్ణకోశంలో జరిగే మార్పు సీతాకోకచిలుక జాతిని నియంత్రించేలా చేస్తుంది. ఒకసారి బిటి విషం చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టాక జీర్ణకోశ జీవకణాల్ని చంపుతుంది. ఇది కీటకాలు మరణించడానికి దారితీస్తుంది. అయితే, జన్యుమార్పిడి పంటల్లో బిటి విషం మొత్తం చురుగ్గా వుంటుంది. ఇది వేళ్లతో సహా మొక్క అన్ని భాగాల్లోనూ వ్యాపించి వుంటుంది. ఫలితంగా జన్యుమార్పిడి పంటల్లో వున్న బిటి విషం సస్యరక్షణ మందుగా వాడే బిటి విషం కన్నా భిన్నమైంది. క్షీరదాలలో బిటి విషం అలర్జీల్ని కలిగిస్తుంది. రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. బిటి టాక్సిన్‌ క్రై 1ఎబి రకం మానవ జీవకణాలని అంటిపెట్టుకుని వుంటుందని ప్రయోగ పూర్వకంగా ఇటీవల నిరూపించారు. తద్వారా ఆ కణాలు చనిపోతాయి. అయితే, బిటి టాక్సిన్‌ మోతాదు ఎక్కువగా వున్నప్పుడే ఇలా జరుగుతుంది. గర్భిణీలలో బిటి విషం రక్తప్రసరణలో కలిసి పిండాన్ని చేరినట్లు వెల్లడైంది. మానవ జీర్ణవ్యవస్థలో బిటి విష అణువులు విచ్ఛిన్నం కావనీ, కొనసాగుతాయనీ ఇవన్నీ నిర్ధారిస్తున్నాయి. ఇప్పటిదాకా జీవ సాంకేతిక పరిశ్రమల వారు ఇది విచ్ఛిన్నం అవుతుందని చెప్పారు. ఇది ప్రమాదకరమైన పరిణామం. (మైకేల్‌ ఆంటోనియో తదితరుల నుండి..)
మీకు తెలుసా..?
a జీవం కలిగిన జన్యుమార్పిడి జీవాలు అంటే పునరుజ్జీవం పొంది, పెరగగల శక్తిగలవి. జన్యుమార్పిడి జీవాలన్నీ ఈ శక్తిని కలిగి వుండాల్సిన అవరం లేదు. అంటే, అన్ని జీవం కలిగిన జన్యుమార్పిడి జీవాలు జన్యుమార్పిడి జీవాల్లో భాగం. కానీ, జన్యుమార్పిడి జీవాలన్నీ జీవం కలిగి వుండాల్సిన అవసరం లేదు.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

No comments:

Post a Comment