Sunday, 21 October 2012

విశ్వానికి అంతం లేదా?


  • ఎందుకని? ఇందుకని!
దేనికైనా అంతం ఉంది. మరి విశ్వానికీ అంతం ఉండాలి కదా?
- బి.శ్రీనివాస్‌, పరదేశమపేట, జగన్నాయక్‌పుర, కాకినాడ, తూ.గో.జిల్లా
పదార్థాల రూపానికి శాశ్వతత్వం లేదు. ఎందుకంటే పదార్థాల్లో మార్పు సహజం. అది అనివార్యం. అంటే పదార్థాల గుణగణా లకే అంతం ఉందిగానీ పదార్థానికే అంతం ఉంది అనుకోకూడదు. పదార్థానికి అంతం ఎపుడూ లేదు. శక్తి కూడా పదార్థ రూపమే. విశ్వం మొత్తం పదార్థ రూపమే. కాబట్టి విశ్వానికి ఆది, అంతం రెండూ ఉండవు. అది ఎపుడూ ఉంది. ఎల్లపుడూ ఉంటుంది. కానీ అనునిత్యం, అనుక్షణం మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ఆకాశంలో రెండు మేఘా లున్నాయి. అందులో మొత్తం 10 లీటర్ల నీరు, రెండు గ్రాముల దుమ్మూ ధూళి ఉన్నాయనుకొందాం. ఉష్ణోగ్రత తగ్గడం వల్ల ఆ రెండు మేఘాలు, వర్షంలా కురిశాయి. అంటే మేఘాలు ఇపుడు లేవు. కాబట్టి మీరన్న అర్థంలో మేఘాలు అంతరించాయి. కానీ మేఘాల్లో ఉన్న 10 లీటర్ల నీరు, రెండుగ్రాముల ధూళి మేఘ రూపంలో నుంచి మురికి వర్షపునీరుగా భూమ్మీద పడ్డాయి. ఆ మురికినీటిలో 10 లీటర్ల నీరు, అందులో ఆ రెండు గ్రాముల ధూళి కలిసే ఉన్నాయి. కాబట్టి మేఘాలలో ఉన్న పదార్థాలు నాశనం కాలేదు కదా? ప్రధానంగా జీవులు పుట్టడాన్ని, మరణించడాన్ని 'పుట్టిన ప్రతిదీ గతించక మానదు. గతించిన ప్రతిదీ తిరిగి పుట్టక మానదు' అన్న తాత్విక దృష్టిలో మీరు విశ్వాన్ని ప్రశ్నించినట్లున్నారు. నా ఉదాహరణనే తీసుకుందాం. నేను 1956, జులై 2వ తేదీన పుట్టాను. కానీ అది సమాజానికి ఓ పుట్టినతేదీగా గుర్తించడానికి తల్లి గర్భం నుంచి బయటపడ్డ ఓ ఘట్టాన్ని (incidence of delivery) పుట్టిన తేదీ, సమయంగా భావిస్తున్నారు. కానీ నారూపం ఆరోజుకు ముందు కూడా ఉంది. అయితే నా తల్లి గర్భంలో ఉంది. అంటే 1956 జూన్‌ 2వ తేదీకి ముందే నేను లేనా? ఎందుకు లేను? నా తల్లి గర్భంలో అరకేజీ తక్కువ బరువులో ఉన్నాను. అంతకుముందు 9 నెలల క్రితం ఎక్కడ ఉన్నాను? ఇంకా సూక్ష్మ రూపంలో సంయుక్త జీవకణం (zygote) రూపంలో ఉన్నాను. అపుడే 'నేను' అన్న భావానికి అర్థం, రూపం నిర్దేశించబడ్డాయి. కానీ అర్థాన్ని, ఆ రూపాన్ని శాసించే చిహ్నాలు (code) నా తల్లి అండం (egg), నా తండ్రి శుక్ర కణం (sperm) లలో ముందే దాగున్నాయి. ఆ చిహ్నాలకు, జన్యుస్మృతికి విరుద్ధంగా నా సూక్ష్మరూప సంయుక్తకణం ఉండదు. మరి ఆ అండానికి, శుక్రకణానికీ ఆధారం ఎవరు? ఇలా వెనక్కి వెళ్లితే ఈ భూమ్మీద జీవావిర్భావం వరకూ వెళ్లవచ్చును. కాబట్టి నా జన్మ తేదీ కేవలం సాపేక్షమే (relative) గానీ ఓ పదార్థ నూతన ఆరంభం కాదు. నా శరీరంలో ఉన్న ప్రతి కణం, ప్రతి కణంలోని ప్రతి అణువు, ప్రతి అణువులోని ప్రతి పరమాణువు, ప్రతి పరమాణువులో ఉన్న ప్రతి ప్రాథమిక కణం ఈ విశ్వంలో నుంచే నా రూపంలోని ఓ సందర్భంలో ఓ చిరు గుణాత్మక మార్పు ద్వారా రామచంద్రయ్య అనే సంయుక్త జీవకణం ఏర్పడింది. అది నా తల్లి నుంచి వచ్చిన పోషక పదార్థాల్ని వాడుకుంటూ కణవిభజన చెంది, జన్యుస్మృతి (genetic code) ప్రకారం 4 కేజీల బరువున్న మగపిల్లాడిగా ఆ రోజు జన్మిం చింది. పుట్టిన తర్వాత భూవాతావరణంలో ఉన్న గాలిని, తల్లిపాలను, ఆ తర్వాత రైతుల శ్రమతో పండిన వరిగింజ ల్లోని ఆహారపదార్థాలు, పప్పుదినుసులు, నూనెలు, మాం సం, చేపలు, నీరు సేవిస్తూ 4 కేజీల నుంచి 80 కేజీల య్యాను. సమాజంలో తిరగడం వల్ల భాష, ప్రకృతి జ్ఞానం, ప్రజాశక్తికి వ్యాసం రాయగల కనీసపు ఆలోచనలు సిద్ధించాయి. మరికొన్నేళ్ల తర్వాత ఈ శరీరంలో ఇప్పటి లాగే సజావుగా జీవప్రక్రియలు (physiological processes) కొనసాగలేవు. అందులో కొన్ని మొరా యిస్తాయి. లేదా ఎప్పుడూ మనకన్నా ముందే ఈ భూమ్మీ ద పుట్టిన సూక్ష్మజీవులు నా మీద దాడిచేసి లేనిపోని మాయరోగాలు నాకు వచ్చేలా చేస్తాయి. లేదా ఏదైనా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల నామీద కాల్పులు జరగ వచ్చును లేదా నా జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ దొంగ లించడం కోసం అమెరికా సంస్కృతిని వంటబట్టించు కొన్న ఓ మందుబాబు నన్ను తుపాకీతో పేల్చ వచ్చును. మొత్తం మీద మరణం ఏదోవిధంగా వస్తుంది. ఈ మరణం రామచంద్రయ్యలోని పదా ర్థానికి కాదు. అది ఏదైనా వైద్యకళాశాలలో విద్యార్థుల ప్రయోగాలకు సమకూరే మృతదేహంగా ఉపయోగ పడుతూ ఉంటుంది. శస్త్రచికిత్స ప్రయోగాల్లో ముక్కలైన దేహభాగాల్ని వైద్యకళాశాల వారు దహనం చేస్తే అది మంట (combustion) అనే రసాయనిక ప్రక్రియ ద్వారా CO2, H2O, NO2, P2O5, Ca3 (PO4)2, CaSO4, NaCl,….వంటి పలురకాల ఘన, ద్రవ, వాయు పదార్థాలుగా మారి భూ పదార్థాల సంచయంలోకి శోషించుకుంటుంది. కాబట్టి పుట్టినపుడున్న పదార్థాలు, మరణానంతర పదార్థాలు, పెరుగు తున్న క్రమంలో వాడుకున్న పదార్థాలు, పెరుగుతున్న క్రమంలో మల మూత్రాదులు, చెమట, నిశ్వాసాలు తదితర ప్రక్రియల్లో విసర్జించిన పదా ర్థాలు అన్నీ ఈ విశాల విశ్వంలో అటూయిటూ గుణాత్మకంగా ఓ నియమా నుసారం మారే ప్రక్రియల్లో అంతర్భాగాలే అన్న విషయం మనం గుర్తుం చుకోవాలి. ఇదే ఉదాహరణ మీకు, అందరికి, ప్రతి చెట్టుకు, ప్రతి వస్తువు కు మనం ఆపాదించాలి. ఉన్నట్టుండి శూన్యం నుంచి భూమి పుట్టలేదు. కొందరు ఛాందసవాదులు, మతతత్వవాదులు శూన్యం నుంచి దేవుడనే ఓ పెద్ద సృష్టికర్త ఆదేశం నుంచి విశ్వం పుట్టిందంటారు. ఆ వాదన శాస్త్ర పరీక్షకు నిల్వదు. అలాగే ఈ సృష్టికి విలయం (annihilation) ఉంటుం దనీ, ఏదో ఒకరోజు ఆ లోకనాటకుడు, చిద్విలాసుడు, జగన్నాటక సూత్ర ధారి సరదాగా మనం కంప్యూటర్‌ను షట్‌డౌన్‌ చేసినట్లుగా ఈ విశ్వాన్ని తన లోకి గుటకాయ స్వాహా చేస్తాడనీ అదే విశ్వానికి అంతమనీ, అది మరెంతో దూరంలో లేదనీ లేనిపోని ఆందోళనను ఇతరులకు కలిగిస్తారు. అదీ జరిగేదేమీ కాదు. ఈ విశ్వం ఎపుడూ ఉంది, ఎల్లపుడూ ఉంటుంది. ఈ విశ్వం లో ఉన్న పదార్థం పలురూపాల్లో ఉంది. గతితార్కికంగా రూపాలు, గుణాలు మార్చుకుంటూ పదార్థ, ప్రదేశ, కాలాల్ని (matter, space, time) తనలో మమేకం చేసుకుంటుంది.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

No comments:

Post a Comment