Sunday, 21 October 2012

సముద్ర.. తీర.. జీవవైవిధ్యం.. పరిరక్షణ..


భూగోళ ఉపరితలంలో 70% పైగా విస్తీర్ణాన్ని సముద్రాలే ఆక్రమిస్తున్నాయి. నాలుగు కిలోమీటర్ల లోతు వరకూ జీవులు జీవించగలుగుతున్నాయి. సముద్రాలు ఇంత విస్తృతంగా వున్నప్పటికీ భూగోళంలో వుండే జీవవైవిధ్యంలో దాదాపు 20% మాత్రమే వీటిలో వుంటుంది. కానీ, భూభాగంలోని జీవవైవిధ్యం, దాని కొనసాగింపులో సముద్రాలు కీలకపాత్ర వహిస్తున్నాయి. ముఖ్యంగా మనం పీల్చుకునే ఆక్సిజన్‌లో దాదాపు మూడోవంతు సముద్రజీవుల నుండే లభిస్తుంది. భూ భాగంలోని అన్ని వృక్ష, జంతు జీవులకన్నా 15 రెట్లు అధిక కార్బన్‌ డై ఆక్సైడ్‌ను సముద్రాలు నిక్షిప్తం చేస్తున్నాయి. సముద్రజీవులు (చేపలు, పీతలు, రొయ్యలు తదితరాలు) మనకు ఆహారంగా ఉపయోగపడుతూ ప్రొటీన్లను సరఫరా చేస్తున్నాయి. భూగోళంపై వాతా వరణమార్పుల హెచ్చుతగ్గుల్ని నియంత్రిస్తూ ఒకమేర మాత్రమే మారేలా చేస్తున్నాయి. ఇంత ప్రాముఖ్యతగల జీవావరణ వ్యవస్థలో 34 అకశేరుకాల వర్గాల్లో 32 సముద్ర, తీర జీవావరణంలోనే నివసిస్తున్నాయి. ఈ జీవావరణంలో ఐదు లక్షల నుండి కోటి సముద్రజాతులు వున్నట్లు అంచనా. సముద్రంలో అతిగా చేపల్ని పట్టడం, కాలుష్యం సముద్ర జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే భూగోళ జీవవైవిధ్యం కూడా అస్థిరత్వానికి గురవుతుంది. వీటి పరిరక్షణపై ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కార్యక్రమాలను రూపొందిస్తుంది. వీటిని 'ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు' సహకారంతో సంక్షిప్తంగా తెలుపుతూ మీ ముందుకొచ్చింది ఈ వారం 'విజ్ఞానవీచిక'.

సముద్రగర్భంలో, తీరాల్లో కొన్ని జీవులు వుంటుండగా, తీరప్రాంతంలో మరి కొన్ని వుంటున్నాయి. మడ (తీరప్రాంత) అడవులు, పగడపు దిబ్బలు (కోరల్‌రీఫ్స్‌), సముద్రగడ్డి దొంతరలు (బెడ్స్‌), నదులు సముద్రంలో కలిసేచోట ఏర్పడే దీవులు (ఎస్చ్యూరీస్‌), ఉష్ణజలీకరణ ప్రాంతాల వద్ద, సముద్ర పర్వతాలు, సముద్ర అడుగు భాగంలో జమకూడే మెత్తని అవక్షేపాలు (సాఫ్ట్‌ సెడిమెంట్స్‌) ఇవన్నీ... సముద్ర జీవవైవిధ్యానికి నిలయాలు. సముద్ర జీవావరణంలో వైవిధ్య, నివాస ప్రాంతాలు వున్నాయి. వీటిని ప్రధానంగా రెండు రకాలుగా గుర్తిస్తున్నారు. వీటిలో నీరు ఒకటి కాగా, సముద్ర అడుగుభాగం రెండోది. నీటి జీవావరణాన్ని 'పెలాజిక్‌ హాబిటాట్‌'గా వ్యవహరిస్తున్నారు. సముద్రం అడుగుభాగాన వున్న జీవావరణాన్ని 'బెంతిన్‌ హాబిటాట్‌'గా వ్యవహరిస్తున్నారు.
నీటి జీవావరణం..
నీటిలోని నివాసస్థలాన్ని లోతు ఆధారంగా మూడు మండలాలుగా గుర్తించారు. అవి: సూర్యరశ్మి ప్రసరణ జరిగే 100 మీటర్ల లోతు వరకూ ఒకటో మండలం. అయితే, బురద ఎక్కువగా వుండే సముద్రాల్లో ఈ మండలం మీటరు లోతుకే పరిమితమవుతుంది. ఈ పలచని మండలంలో మొక్కజాతులు కిరణజన్య సంయోగక్రియతో తమకు కావలసిన ఆహారాన్ని తామే తయారుచేసుకుం టాయి. ఈ మండల న్ని 'యు ఫోటిక్‌ మండలం'గా పిలుస్తారు. ఈ మండలం కింద 2000 మీటర్ల లోతు వరకూ సూర్యరశ్మి ప్రసరించదు. దీనిలో జంతువులే ప్రధానంగా వుంటాయి. ఇది రెండోది. దీన్ని 'బాతైల్‌ మండలం'గా పిలుస్తారు. దీనికింద ఆరువేల మీటర్ల వరకూ చిమ్మచీకటితో కూడి వుండేది మూడోది. దీన్ని 'ఎబిస్సిమల్‌ మండలం'గా పిలుస్తారు. వీటన్నింటికీ అడుగుభాగంలో రసాయనాల మడ్డి, వృక్ష, జంతు అవశేషాలు తదితరాలు వుంటాయి. వీటిలో పదింట తొమ్మిది వంతుల సముద్ర జీవరాశులు నివసిస్తాయి. సముద్ర, తీర జీవవైవిధ్య పరిరక్షణకు తీరప్రాం తాల్లో నివసించే ప్రజల భాగస్వామ్యం ఎంతైనా వుంది. స్థానిక పరిస్థితులకు అనుగుణమైన పరిరక్షణ కార్యక్రమాల్ని అమలుచేయాల్సి వుంటుంది.
ప్లాంక్‌టన్‌ (పాచి)..
అన్ని సముద్రజీవుల ఆహారానికి మూలం ఈ పాచి. వృక్షజాతికి సంబంధించిన (ఫైటో ప్లాంక్‌టన్‌) 'డై ఆటం ముఖ్యమైనది. ఇది చిన్న చిన్న జంతువులకు (జూ ప్లాంక్‌టన్‌) ఆహారం. లార్వా, ష్రింప్స్‌ (రొయ్య పిల్లలు), క్రాబ్స్‌ (పీతలు)
జూ ప్లాంక్‌టన్‌ కిందకు వస్తాయి. సంయుక్తంగా ఇవి ఎన్నో చేపలకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఈ చిన్న చేపలు పెద్ద చేపలకు, సముద్ర క్షీరదాలకు ఆహారం.
అస్థిరత్వం ఎక్కడ నుండి..?
భూభాగం నుండి సముద్రానికి చేరుతున్న కాలుష్యం అస్థిరత్వానికి దోహదపడుతుంది. ప్రధానంగా ముడి చమురు, ఓడల్లో నుండి వచ్చే మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు కాలుష్య కారకాలు. సముద్రంలోకి చేరుతున్న వృక్ష పోషకాలు ప్లాంక్‌టన్‌, ఇతర జీవుల పెరుగుదలకు దోహదపడతాయి. పెరిగిన వృక్ష, జంతుజీవాలతో ఇది చిక్కగా కనిపిస్తుంది. దీన్నే 'యూట్రిఫికేషన్‌'గా పిలుస్తున్నారు.
* అతిగా చేపలు పట్టడం. నాశనం కలిగించే విధంగా చేపల్ని పట్టడం, చట్ట వ్యతిరేకంగా దొంగతనంగా చేపల్ని పట్టడం, నియంత్రణ లేని చేపలు వేట.ఇవన్నీ చేపల పెరుగుదలకు ఆటంకం. ఇపుడు 60 కిలోమీటర్ల వరకూ విస్తరించే వలలు వచ్చాయి. మామూలుగా ఏ చేపా ఈ వలల నుండి తప్పించుకోలేదు. దీనివల్ల కొన్ని దేశాల్లో ఈ వలలకు రంధ్రాల్ని ఉద్దేశపూర్వకంగా పెడుతున్నారు. ఫలితంగా చిన్న చేపలు, ఇతర జంతువులు తప్పించుకుని, కేవలం పెద్ద చేపలే వలకు చిక్కుతాయి. తప్పించుకొన్న చిన్న చేపలు పెద్దవై అధిక ఆహారాన్ని అందిస్తాయి.
* సముద్రంలో వుండే చేపలు, వేల్స్‌, ఇతర సముద్రజీవుల వేట ప్రమాదకరంగా మారుతుంది.
* భౌతిక నివాస స్థలమార్పులు చేయడం.
* బయటి జాతుల దాడి.
* భూగోళ వాతావరణమార్పులు.
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచ చేపల నిల్వలో 70 శాతం ఇప్పటికే పట్టేశారు. ఫలితంగా చేపల సంఖ్య తగ్గిపోతుంది.
* పగడపు దిబ్బల (కోరల్‌ రీఫ్స్‌)లో 20 శాతం ఇప్పటికే అంతరించిపోయాయి. సమీపకాలంలో ఇవి పునరుజ్జీవం పొందే, పెరిగే అవకాశం కూడా లేవు. 1998లో సంభవించిన పగడపుదిబ్బలు బ్లీచింగ్‌ (రంగు కోల్పోవడం) వల్ల 16 శాతం అంతరించిపోయాయి. అయితే ఆ తర్వాత తీసుకున్న పరిరక్షణ చర్యల వల్ల 40 శాతం పునరుద్ధరించబడ్డాయి. కానీ, మానవ కార్యక్రమాల వల్ల 20 శాతం నశించిపోతున్నాయి.
పునరుద్ధరణ కృషి..
దీని లక్ష్యం సముద్రజీవుల్ని పరిరక్షిస్తూ సుస్థిర వినియోగానికి తోడ్పడడం. అందుకు అనుగుణంగా విధానాలు రూపొందించబడ్డాయి. ఈ సందర్భంలో తీర ప్రాంతంలో నివసించే ప్రజల సామాజిక అవసరాల్ని కూడా దృష్టిలో పెట్టుకోబడుతున్నాయి. ముఖ్యంగా లోతైన సముద్రాల్లో జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వం ఇపుడు అమలుచేస్తున్న జీవవైవిధ్య పరిరక్షణా కార్యక్రమాల్లో ముఖ్యాంశం. అతిగా చేపల్ని పట్టకుండా నియంత్రిస్తున్నారు. సముద్ర, తీర ప్రాంతాల సమన్వయ యాజమాన్యం మీద కేంద్రీకరిస్తూ తీసుకునే పరిరక్షణ చర్యలు వీటి వైవిధ్య పరిరక్షణకు దోహదపడతాయి. అయితే, నష్టపరిచే బయటిజాతులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. చేపల పెరుగుదలకు ఆటంకం లేకుండా తీర ప్రాంతాల్లో ఏప్రిల్‌ 15 నుండి జూన్‌ 1 వరకూ వాటిని పట్టడం నిషేధించారు.
సముద్రతీరం..
సముద్రం భూభాగాన్ని కలిసేచోట ఇసుకతో కూడిన తీరాలు (బీచ్‌లు) ఏర్పడతాయి. అలల తాకిడికి రాళ్లూ రప్పలు పగిలి ఇసుక ఏర్పడుతుంది. ఈ తీర ప్రాంతంలో పోషకాలు అధికంగా వుం టాయి. నది నీటి ద్వారా కొట్టుకొచ్చిన పోషకాలు, అలలతో తీరానికి చేరి, పోషకాలు చేరతాయి. తీరం వెంబడి జీవించగలిగే జంతువులు, వృక్షాలు వీటిపై ఆధారపడతాయి. నిరంతరం ఎగిసిపడుతున్న అలలు, ఫలితంగా వస్తూ పోతున్న నీరు, ఇసుక, చిన్న చిన్న రాళ్లు పర్యావరణ పరిస్థితుల్ని నిత్యం మారుస్తుంటాయి. దీనికి ఆటుపోట్లు తోడుంటాయి. తీరం వెంబడి ఇసుక కింద వర్మ్స్‌, గవ్వ కలిగిన జీవాలు అధికంగా వుంటాయి. పైన వున్న ఇసుక సముద్రఆలల తాకిడి నుండి వీటిని రక్షిస్తుంది. మానవ దినచర్యలో భాగంగా ఇవి కూడా ప్రమాదంలో పడుతున్నాయి. కట్టడాల నిర్మాణం, చెత్తాచెదారాల్ని విసిరేయడం, ముడిచమురు పోయడం, పనికిరాని చమురుని కలిపేయడం, మురుగు వంటివి సముద్రంలో వదులుతున్నారు. ఫలితంగా ఈ తీరంవెంబడి జీవిస్తున్న పక్షులు ప్రమాదానికి గురవుతున్నాయి. ఒక విధమైన సముద్ర తాబేళ్లు ఈ ఇసుకలో గుడ్లు పెడతాయి. కాలుష్యం, మానవ జీవనం వల్ల వీటి సంఖ్య బాగా తగ్గిపోతుంది.
మనదేశంలో..
మనదేశం దాదాపు ఎనిమిది వేల కిలోమీటర్ల తీరప్రాంతాన్ని కలిగి వుంది. దీని చుట్టూ సముద్రంలోకి 200 కిలోమీటర్ల దూరం వరకూ 20 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సము ద్రపు వనరుల్ని మనమే వినియోగించుకునే హక్కును కలిగి వున్నాం. అదనంగా అండమాన్‌, నికోబార్‌ దీవుల సమూహం చుట్టూ మరో 60 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన సముద్రాన్ని వినియోగించుకునే హక్కు కలిగి వున్నాం. చేపల ఉత్పత్తి మనకు గరిష్టంగా జూన్‌ నెలలో లభిస్తుంది. పశ్చిమ తీరప్రాంతంలో ఉత్పత్తి ఎక్కువ గా వుంటుంది. తూర్పుతీరంలో తక్కువగా వుంటుంది. కానీ, మడ అడవుల ప్రాంతం లో ఉత్పత్తి ఎక్కువగానే వుంటుంది. దక్షిణ తీరం కొనప్రాంతంలో చేపల ఉత్పత్తి అధి కంగా వుంటుంది. బంగాళాఖాతంలో కూడా చేపల ఉత్పత్తి ఎక్కువగా వుంటుంది.
పగడపు దిబ్బలు (కోరల్‌ రీఫ్స్‌)
సముద్ర జీవావరణ ప్రత్యేకత. వీటిని వెంటనే గుర్తించవచ్చు. ఇవి చేపలకు, జీవవ్యవస్థ కొనసాగింపుకూ కీలకం. అందువల్ల వీటి పరిరక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. సముద్ర అడుగుభాగంలో గల ఎత్తుపల్లాలు జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తున్నాయి.
తీరంలోని చిత్తడినేలలు..
మడ అడవులు ఉప్పునీరు కలిగిన ఉష్ణ తీర ప్రాంతాల్లో వుంటాయి. వీటి వేళ్లల్లో గాలిని పీల్చుకునేందుకు ప్రత్యేకమైన ఏర్పాటు వుంది. కొన్ని వేళ్లు గాల్లోకి పైకి పెరిగి, గాలిని పీల్చుకుంటాయి. ఇవి తీర ప్రాంతాల్ని తుపానులు, అలల నుండి రక్షిస్తాయి.
మీకు తెలుసా..?
* భారత ఫసిఫిక్‌ మహాసముద్రం గరిష్ట జీవవైవిధ్యం కలిగి వుంది. ఒక చదరపు మీటరులో వెయ్యిరకాల జాతులు వున్నట్లు గుర్తించారు.
* వేల్‌: భూగోళంలో అతి పెద్ద క్షీరదం. అందువల్ల ఇవి నీటిలో దీర్ఘకాలం వుండలేదు. మధ్య మధ్య పైకి వచ్చి, స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటుంది. ముక్కు ద్వారా గాలిని వదులుతుంది. ఆ సమయంలో నీరు ఉవ్వెత్తున పైకి లేస్తుంది.
* సముద్రంలో కందకాలూ వుంటాయి. అతి లోతైన కందకం ఫసిఫిక్‌ మహాసముద్రంలో 'మేరియానా ట్రెంచ్‌'. దీనిలోతు 11,034 మీటర్లు.

No comments:

Post a Comment