Monday, 1 October 2012

ప్రగతి బాట ప్రయోగాల కోట ఇస్రో


స్థలం : శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం.
తేది : 9.9.2012
ఉదయం : 9.53 నిమిషాలు.
నిప్పులు చెరుగుతూ నింగివైపు దూసుకుపోయింది పిఎస్‌ఎల్‌వి - సి21.
క్షణాలు గడుస్తున్న కొద్దీ వాతావరణంలోని ఒక్కొక్క పొరను ఛేదించుకుంటూ భూమి పరిధిని దాటి రోదసిలోకి ప్రవేశించింది.
1047 సెకన్లు(దాదాపు 18 నిమిషాలు) ప్రయాణం చేసి 660 కి.మీ. ఎత్తుకు ఎగిరి ఫ్రాన్స్‌కు చెందిన స్పాట్‌-6 ఉపగ్రహాన్ని సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఆ తరువాత మరో 54.6 సెకన్లలో 662 కి.మీ. పయనించి జపాన్‌ ఉపగ్రహం ప్రొయిటరీస్‌ను దాని కక్ష్యలో దింపింది. మరో 20.55 సెకన్లకే తనకు అప్పగించిన పనిని సక్రమంగా పూర్తి చేశానంటూ హైదరాబాద్‌లోని రాడార్‌ ఇమేజింగ్‌ సెంటర్‌కు సంకేత సందేశాలందించింది.
వందో ఉపగ్రహ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసిన ఆ క్షణాలు భారత్‌కు తిరుగులేని ఘనత అందించినవిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. తాము సగర్వంగా తల ఎత్తుకునేలా చేసిన ఆ క్షణాలే దేశవిదేశాల్లోని ప్రతి భారతీయుడి గుండెల్లోనూ అపురూపమైనవిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి. మన ప్రగతి గమనంలో సువర్ణాధ్యాయం సృష్టించిన ఆ విజయమే అమెరికా వంటి దేశాలకు ధీటైన జవాబు కూడా చెప్పింది. 'ఆకలితో అలమటిస్తున్న దేశానికి అంతరిక్ష పరిశోధనలెందుకు.. నకనకలాడే కడుపులతో మీరు పరిశోధనలు చేస్తారా? ప్రయోగాలు చేయగలరా?' అంటూ వెక్కిరించిన అంకుల్‌శామ్‌ వంటి వారికి మన మేథాశక్తితో తిరుగులేని సమాధానం ఇచ్చింది. ఈ సంతోష సమయాన అగ్రరాజ్యాలను సైతం అబ్బురపరిచే స్థాయికి ఎదిగిన మన అంతరిక్ష ప్రయోగాల ప్రస్థానం గురించిన విశేషాలను ఈ వారం అట్టమీది కథలో తెలుసుకుందాం.
వలస పాలకుల నిర్వాకాల వల్ల దేశంలో చేతివృత్తులు దిగజారి పోయి వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ కారణంగానే స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో, ముఖ్యంగా 1960వ దశకంలో భారత్‌ తీవ్ర కరువుకాటకాల బారిన పడింది. మరోవైపు సోషలిస్టు రష్యా శాస్త్ర విజ్ఞానం ఆసరాగా అది వేగంగా అభివృద్ధి చెందింది. మనలాంటి దేశాలకు స్నేహ హస్తం చాచి కోరిన సాయం అందించింది. రష్యా సహకారంతో కీలకరంగాల్లో పెద్ద పెద్ద అడుగులేయాలని ఆనాటి మన నేతలు భావించారు. అది అందించే ఫలాలతోనే అకలి తీర్చి అందరినీ అభివృద్ధిలో భాగస్వాములు చేయగలమని నిశ్చయించారు. సైన్సు బాట పట్టారు. ఈ క్రమంలోనే శాస్త్ర, సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పలు విధానాలు రూపొందించారు. అంతరిక్ష రంగానికి ప్రాధాన్యతనిస్తూ వివిధ కార్యక్రమాలు అమలు చేశారు.
గత శతాబ్దం ప్రారంభం నుంచే దేశంలో వాతావరణ, అంతరిక్ష సంబంధిత అంశాల్లో శాస్త్రీయ పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఎస్‌కె మిత్ర వంటి శాస్త్రవేత్తలు 1920లోనే కొల్‌కతాలో వాతావరణ మండలాలపై ప్రత్యేక పరిశోధనలు చేశారు. సివి రామన్‌, మేఘనాథ్‌ సాహా వంటి వారి ఆవిష్కరణలు భారత్‌లో అంతరిక్ష శాస్త్ర ఆవిర్భావానికి దోహదం చేశాయి. అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న అంతరిక్ష ప్రయోగాలను ఒకే వేదికపైకి తెచ్చి వాటిని దేశాభివృద్ధికి వినియోగించేలా చేయగలిగిన ఘనత మాత్రం విక్రమ్‌సారాభారు, హోమీబాబాకే దక్కుతుంది.
1950లో అణుశక్తి విభాగం ఏర్పాటైంది. దాని తొలి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన హోమీబాబా అంతరిక్ష పరిశోధనల కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. ఈ రంగంలో విశేష ప్రగతి సాధించిన సోవియట్‌ రష్యా 1957లో స్ఫుత్నిక్‌ను ప్రయోగించింది. అంతేకాదు భారత్‌ వంటి దేశాలు ఈ రంగంలో పరిశోధనలు చేయడానికి ఎంతగానో చేయూతనిచ్చింది. సాంకేతిక సహకారాలందించింది. దానివల్లనే మరిన్ని పరిశోధనలు జరిపేందుకు 1962లో ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చ్‌ సంస్థ (ఐఎన్‌సిఓఎస్‌పిఎఆర్‌) స్థాపితమైంది.
ఈ రంగంలో విశేషమైన పరిశోధనలు కొనసాగాయి. సంబంధిత సంస్థలు ఎన్నో ఏర్పాటైనాయి. వాటి కృషి ఫలితంగా లభించిన ప్రతీ ఫలితమూ, సాంకేతిక పరిజ్ఞానమూ భారత ప్రగతికి వినియోగించడం ప్రారంభమైంది. దానితో అభివృద్ధిలో అంతరిక్ష శాస్త్ర ప్రాధాన్యత ప్రభుత్వానికి స్పష్టంగా అవగతమైంది. నాటి ప్రధాని నెహ్రూ అంతరిక్ష శాస్త్ర అభివృద్ధి బాధ్యతలను విక్రమ్‌ సారాభారు, హోమీబాబా వంటి వారికి అప్పగించారు. దానితో విక్రమ్‌ సారాభారు అంతరిక్ష పరిశోధనలపై పూర్తి దృష్టిని సారించారు. కేరళ రాజధాని తిరువనంతపురం సమీప తీరప్రాంతంలోని మత్స్యకారుల గ్రామమైన తుంబను తన ప్రయోగాలకు కేంద్రంగా ఎంచుకున్నారు. కనీస సౌకర్యాలు కూడా లేని ఆ ఊళ్లోని సెయింట్‌ మేరీ మేడలీన్‌ చర్చికి చెందిన పశువుల పాకలో అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు.
వివిధ దేశాలోని భారతీయ శాస్త్రవేత్తలను దేశాభివృద్ధి కోసం జరిగే ఈ ప్రయోగాల్లో భాగం పంచుకోవాల్సిందిగా ఆహ్వానించారు. తగు శాస్త్ర సౌకర్యాలు లేని కారణంగా ఆయన పిలుపునకు స్పందన రాలేదు. దానికి తోడు అమెరికా వారు మాత్రం 'కరువు కాటకాలతో సతమతమవుతూ అర్థాకలితో కడుపులు మాడి ఛస్తున్న దేశం అంతరిక్ష ప్రయోగాల గురించి ఆలోచించడమా?'అని హేళనగా మాట్లాడారు. 'కనీస సౌకర్యాలు కూడా లేని మీరు ప్రయోగాలు చేయగలరా?' అంటూ ఎద్దేవా చేశారు. ఇటువంటి దెప్పిపొడుపులకు ఏమాత్రమూ వెనుకంజ వేయని దృఢచిత్తుడు విక్రమ్‌ సారాభారు. కనుకనే భారత్‌కు రావడానికి ఇష్టంలేని వసంత్‌ గోవారికర్‌ వంటి సీనియర్‌ శాస్త్రవేత్తలనూ ఒప్పించి తీసుకు రాగలిగాడు. వీరందరినీ తుంబకు రప్పించి అక్కడి పశువుల కొట్టంలోనే పరిశోధనలు చేయించారు. 1963 నవంబర్‌ 21న అమెరికా తయారు చేసిన నైక్‌-అపాచే రాకెట్‌నే తొలిసారిగా అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించారు. తమ ప్రయత్నాలు, ప్రయోగాలను అవహేళన చేసిన ఆ దేశంతోనే 'ఔరా' అనిపించగలిగారు విక్రమ్‌ సారాభారు నేతృత్వంలోని మన శాస్త్రవేత్తలు.
ఆనాడు అలా ఆకలి, అవమానాల మధ్య మొదలైన మన అంతరిక్ష ప్రయోగాలు నేడు 'సెంచరీ' కొట్టి అగ్రదేశాల సరసన నిలిచి ప్రపంచంతోనే జేజేలు కొట్టించుకునే స్థాయికి చేరుకున్నాయి.
ఆనాటి పరిస్థితులను ఓ సందర్భంలో గుర్తుకు తెచ్చుకున్న వసంత్‌గోవారికర్‌ 'అప్పట్లో ఎటువంటి సౌకర్యాలూ లేవు. మాకు నివాసాలు కూడా సరిగ్గా ఉండేవికావు. చర్చి బిల్డింగ్‌లో ఆఫీసు ఉండేది. పశువుల పాకలో ప్రయోగాలు చేసేవాళ్లం. వాహనాలు కూడా పెద్దగా లేవు. సైకిళ్లపైనే ప్రయాణిస్తూ, వాటిపైనే సాంకేతిక పరికరాలు తరలించేవాళ్లం' అని చెప్పారు. అంటే మన అంతరిక్ష ప్రయోగాలు ఎటువంటి పరిస్థితుల్లో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఈ రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంతోనే 1963లో సారాభారు నేతృత్వంలోనే ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) స్థాపితమైంది. కొన్ని ప్రయోగాలు విఫలమయ్యాయి. దానితో ఇస్రో నీరసపడలేదు. అపజయాల నుండి గుణపాఠాలు నేర్చుకుని విజయాలు సాధించింది. క్రమంగా అది దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పరిశోధనాలయాలు, పలు ఏజెన్సీలు, లేబొరేటరీలను ఏర్పాటు చేసుకోగలిగింది.
'అంతరిక్ష పరిశోధన అంటే జాతి సామర్థ్యం ప్రదర్శించడమే, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే. పేదరికం, నిరక్షరాస్యత రాజ్యమేలుతున్న భారత్‌ వంటి దేశాల్లో ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలి. దానికోసం వారికి నిరంతరం సమాచారమందిస్తుండాలి. ఇది అంతరిక్ష రంగంలో మనం సాధించే ఫలితాలపైనే ఆధారపడింది. వాటితోనే మన సోదర భారతీయులను అభివృద్ధి క్రమంలో భాగస్వాములను చేయగలం' అంటూ సారాభారు తోటి శాస్త్రవేత్తలకు స్ఫూర్తినందిస్తూ వారిని ముందుకు నడిపించేవారు. ఆయన చెప్పినట్లుగానే స్పేస్‌ సైన్స్‌ అందించిన ఫలాలతోనే మనమంతా సుఖవంతమైన, చైతన్యవంతమైన, ఫలవంతమైన జీవనం కొనసాగించగలుగుతున్నాం.
ఆయన తరువాత ఇస్రో రెండవ ఛైర్మన్‌గా సతీష్‌ధావన్‌ బాధ్యతలను అందిపుచ్చుకున్నారు. ఈయన కాలంలోనే 1975లో భారత్‌ తన తొలి ఉపగ్రహం 'ఆర్యభట్ట'ను తయారు చేసి సోవియట్‌ రష్యా సహకారంతో ప్రయోగించాం. ఆ పరంపరలోనే భాస్కర, రోహిణి, ఆపిల్‌ తదితర 10 ఉపగ్రహాలనూ ప్రయోగించి ఇస్రో కీర్తిని ఇనుమడింపచేశారు ధావన్‌. ఆయనే బెంగళూరు, హసన్‌లలో అంతరిక్ష పరిశోధనా కేంద్రాలను నెలకొల్పారు. ఈయన అనంతరం 1984లో ఇస్రో ఛైర్మన్‌గా భాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్‌ యుఆర్‌ రావు కాలంలో స్రాస్‌, ఐఆర్‌ఎస్‌, ఇన్‌శాట్‌ వంటి 10 ఉపగ్రహాలనూ విజయవంతంగా ప్రయోగించింది భారత్‌. ఈయన తరువాత ఆ స్థానంలోకొచ్చిన కస్తూరి రంగన్‌ హయాంలో ఇస్రో రికార్డు స్థాయిలో 17 ఉపగ్రహాలను ప్రయోగించింది. అటు తరువాత 2003లో ఛైర్మన్‌గా నియమితులైన మాధవన్‌ నాయర్‌ నేతృత్వంలో పిఎస్‌ఎల్‌వి, జీఎస్‌ఎల్‌వి అభివృద్ధితో పాటు, చంద్రయాన్‌-1 వంటి 17 ప్రయోగాలు జరిగాయి. 2009 నుంచీ ఇస్రో ఛైర్మన్‌గా పని చేస్తున్న రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ప్రస్తుత వందో ప్రయోగంతో కలిపి మొత్తం 11 ప్రయోగాలు జరిగాయి.
అంతరిక్ష ప్రయోగాల్లో పాల్గొంటున్న సంస్థలు
జీరోనుండి ప్రారంభమైన మన అంతరిక్ష పరిశోధనలు సెంచరీ విజయాల స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో మంది కార్యదక్షతకు తోడు ఎన్నో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల కృషి ఉంది. మొత్తం వ్యవస్థకు కేంద్రస్థానంలో ఉన్న ఇస్రో ఆరు ప్రధాన కేంద్రాలున్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో లేబొరేటరీలు, యూనిట్లు, ఏజెన్సీలతో తన కార్యకలాపాలు నిర్వహించుకుంటుంది ఇస్రో. ఇవి అత్యధికంగా బెంగళూరులో ఉన్నాయి కాబట్టే దాన్ని 'అంతరిక్ష నగరం'గా పిలుస్తారు.
అంధ్రప్రదేశ్‌ భాగస్వామ్యం
కీర్తి బావుటా ఎగురవేసిన పరిశోధనలకు తెలుగువారు కూడా ఇతోధికంగా తోడ్పాటునందిస్తున్నాం. రాకెట్‌లో వినియోగించే ద్రవరూప ఇంధనాన్ని తణుకు షుగర్‌ ఫ్యాక్టరీ తయారు చేస్తుంది. హైదరాబాద్‌లో ఎన్‌ఆర్‌ఎస్‌ ఉంది. ఇలా ఎన్నో ఉన్నా అన్నిటినీ మించి శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఉండడం మనందరికీ గర్వకారణం.
అతి విశిష్టమైనది సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం
అంతరిక్ష ప్రయోగాలకు అనువైన ప్రదేశం కొరకు గాలిస్తూ 1968 ఆగస్టులో తూర్పు తీరప్రాంతంలో ఏరియల్‌ సర్వే జరుపుతున్న విక్రమ్‌ సారాభారుని చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న శ్రీహరికోట ద్వీపం బాగా ఆకర్షించింది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో పులికాట్‌ సరస్సునావరించి ఉన్న ఈ 170 చదరపు కిలో మీటర్ల భూభాగం నెల్లూరు, చెన్నై మధ్య అయిదో నెంబరు జాతీయ రహదారిపై తడ గ్రామానికి 30 కి.మీ.దూరంలో ఉంది. సారాభారు కోరిక మేరకు నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ఈ స్థలాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. దానితో సారాభారు నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం సూళ్లూరుపేట నుంచి నాటుపడవల ద్వారా శ్రీహరికోట ద్వీపం చేరుకుని తమ కార్యకలాపాలను ఆరంభించారు. ద్వీపంలోని యానాదులకు కాలనీ నిర్మించారు. ప్రయోగ కేంద్రంలో వారికి ఉద్యోగాలిచ్చారు. 1971 అక్టోబర్‌ 9న ఇక్కడ నుంచి రోహిణి సౌండ్‌ రాకెట్‌ను తొలిసారిగా ప్రయోగించారు.
షార్‌కు విశిష్ట గుర్తింపు
విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్‌ సతీష్‌ ధావన్‌ పేరిట షార్‌ పేరు 2002లో సతీష్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగం కేంద్రంగా మారింది. దేశవిదేశాలకు చెందిన ఉపగ్రహాలెన్నిటినో ప్రయోగించిన ఈ కేంద్రం నుంచి చేసే ప్రయోగాలు తప్పనిసరిగా విజయవంతమవుతాయని ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మకం కూడా పేరుకుపోయిందంటే దీనికి గల పేరు ప్రఖ్యాతులెలాంటివో అర్థం చేసుకోవచ్చు.
సతీష్‌ ధావన్‌
'ప్రయోగాత్మక ద్రవ పదార్థాల పరిశోధక పిత'గా కీర్తిపొందిన సతీష్‌ ధావన్‌ వృత్తిరీత్యా ఏరోస్పేస్‌ ఇంజనీర్‌. శ్రీనగర్‌లో 1920 సెప్టెంబర్‌ 25న జన్మించిన ఈయన విద్యాభ్యాసం భారత్‌లోనూ, అమెరికాలోనూ కొనసాగింది. భారతీయ అంతరిక్ష రంగాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన పరిశోధనను నిర్వహించారు. దీనికి గౌరవంగానే ఈయనను భారత ప్రభుత్వం 1972లో ఇస్రో రెండవ ఛైర్మన్‌గా నియమించింది. సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన ఈయన మేథమేటిక్స్‌లోనూ గ్రాడ్యుయేషన్‌తో పాటు ఎం.ఏ.కూడా చేశారు. 1947లో అమెరికాలోని మిన్నెసోటా యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ను పూర్తి చేశారు. కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లో ఎం.టెక్‌ పూర్తి చేశారు. ఇదయ్యాక అక్కడే మేథమేటిక్స్‌లోనూ, ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లోనూ డబుల్‌ పిహెచ్‌.డి. పూర్తి చేశారు. అనంతరం భారత్‌కు వచ్చిన ఆయన స్పేస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గానూ, భారత ప్రభుత్వ అంతరిక్ష రంగ శాఖ కార్యదర్శిగానూ నియమితులయ్యారు. ఇస్రోకు రెండవ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. దేశంలో అంతరిక్ష కార్యక్రమానికి బీజం వేసింది సారాభారు అయితే దాన్ని విశిష్టంగా విస్తరింపజేసిన వారు సతీష్‌ ధావన్‌. అందుకే వీరిద్దరినీ 'భారత అంతరిక్ష ద్వయం'గా కీర్తిస్తారు. గ్రామీణ విద్య, రిమోట్‌ సెన్సింగ్‌, శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ అంశాల్లో ధావన్‌ అగ్రగామి ప్రయోగాలు చేశారు. వీటి ఫలితంగానే ఇన్శాట్‌, ఐఆర్‌ఎస్‌, పిఎస్‌ఎల్‌వి రూపొందాయి. వీటి వల్లనే భారత్‌ అంతరిక్ష రంగంలో అగ్రగామి దేశాల స్థాయికి ఎదిగింది. 2002లో ఈయన కృషికి గుర్తుగానే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని ఈయన పేరుతో సతీష్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రంగా మార్చారు.

ఇస్రో ఛైర్మన్‌ డా|| కె. రాధాకృష్ణన్‌
ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్‌ డా|| కె. రాధాకృష్ణన్‌ భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగం కార్యదర్శిగా, స్పేస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతరిక్ష రంగంలో ఉత్తమ నిపుణుడుగా, నిర్వాహకుడుగా పేరుపొందారు. కేరళలో 1949 ఆగస్టు 29న జన్మించిన ఈయన కేరళ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌, బెంగళూరు ఐఐఎంలో పిజిడిఎం, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో పిహెచ్‌డి చేశారు. త్రివేండ్రంలోని విక్రమ్‌సారాభారు స్పేస్‌ సెంటర్‌లో ఏవియోనిక్స్‌ ఇంజనీర్‌గా చేయడం ద్వారా 1971లో ఈ రంగంలో కెరీర్‌ ప్రారంభించాడు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నిర్వహణా సామర్థ్యం కూడా ఉన్న ఈయన అంతరిక్ష సంస్థల్లో వివిధ మేనేజ్‌మెంట్‌ హోదాల్లో పని చేశారు. ఇండియన్‌ సునామీ వార్నింగ్‌ ఇనిస్టిట్యూట్‌, ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ వంటి సంస్థలు ఈయన నేతృత్వంలోనే ప్రారంభమైనాయి. ఇంటర్‌గవర్నమెంటల్‌ ఓషనోగ్రఫిక్‌ కమిషన్‌, ఐక్యరాజ్యసమితికి సంబంధించిన శాస్త్రసాంకేతిక సంస్థల్లోనూ రాధాకృష్ణన్‌ వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన హయాంలో ఇప్పటివరకూ 11 ప్రయోగాలు జరిగాయి.

అంతరిక్ష ప్రయోగ వైతాళికుడు

అంతరిక్ష రంగంలో భారత్‌ సాధించిన అన్ని విజయాలకూ, అద్భుత ప్రగతికీ కారకుడు డాక్టర్‌ విక్రమ్‌ సారాభారు. అందుకే ఈయనను 'ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్పేస్‌ ప్రోగ్రాం' అని గౌరవిస్తారు. ప్రతి అంశమూ రాజకీయమయ్యే దేశంలో ఈ రంగంలో రాజకీయాలకు తావు లేకుండా చేయడం వల్లనే ఆయన ఇంతటి అభివృద్ధి సాధించాడని కొందరు వ్యాఖ్యానిస్తారు. అంటే దీన్ని ఎంతగా కాపాడుకుంటూ వచ్చాడో అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్‌ కేటాయింపులు తప్ప ఈ రంగంలో ప్రభుత్వంకానీ, రాజకీయ నాయకులు కానీ జోక్యం చేసుకోకపోవడానికి సారాభారు వ్యక్తిత్వమే కారణం. సారాభారు శాస్త్రసాంకేతిక రంగాల బాధ్యతలతోపాటు వంశపారంపర్యంగా లభించిన వ్యాపారాలు కూడా చూసేవారట. కళలు, సాహిత్యాలంటే ఇష్టపడేవారు. అందుకే ఆయన వెంట ఎప్పుడూ విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులుండేవారట. ఆయన పనితీరు చాలా భిన్నంగా ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా ఉంటుందని కొన్ని ఉదాహరణలు చెబుతారు ఆయనదగ్గర పని చేసిన వారు. అలాంటివాటిలో ఒకటి...ఒక సైంటిస్టును ఒక 'పని' నిమిత్తం విదేశాలకు పంపాలని అర్థరాత్రి నిర్ణయించినా సరే అవతలి వారింటిలో వెంటనే ఫోన్‌ మోగేదట. నిద్రమత్తులో ఉన్న అవతలి వారు ఫోన్‌ ఎత్తి 'హలో' అనగానే 'నువ్వు ఫలానా పనికోసం ఫలానా దేశానికి వెళ్లాలి. ఉదయం పది గంటలకి ఫ్లైట్‌ ఉంది' అని చెప్పేవాడట. ఈ నాలుగైదు గంటల్లో వీసా అదీ రావడం కుదరదులే అనుకుని వారు హాయిగా నిద్రపోయి లేచే లోపలే విమానం టిక్కెట్‌తో పాటు చేయవలసిన పనులు వివరించే పేపర్‌ పట్టుకుని సారాభారు వాళ్ల గుమ్మంలో రెడీగా ఉండేవారట. దానితో అవతలి వారు కిక్కురుమనకుండా విమానమెక్కేవారట. ఆయనకు అంతటి కార్యశూరత ఉండేది కాబట్టే తాము అన్ని ఘన కార్యాలు సాధించగలిగామంటారు అంతరిక్ష శాస్త్రవేత్తలు. దేశీయులనే కాదు విదేశీయులను సైతం ఆకట్టుకునే వారు. ఇందువల్లే భారత్‌ తొలినాళ్లలో రూపొందించిన ఉపగ్రహాలను విదేశాల నుంచి ఉచితంగా ప్రయోగించగలిగారు. ఇతర దేశాల నుంచి కోట్లాది రూపాయిలు వసూలు చేసే దేశాలు ఆయన వ్యక్తిత్వాన్ని చూసే మన ప్రయోగాలకు ఎలాంటి రుసుములూ తీసుకోలేదని చెప్పుకుంటారు.

అంతరిక్ష ప్రయోగాల్లో అబ్దుల్‌ కలామ్‌

'మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా'గా పేరు పొందిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌కు కూడా అంతరిక్ష ప్రయోగాల్లో కొద్దిమేర భాగమయ్యారు. ప్రయోగ వాహనాల రూపకల్పన, అభివృద్ధి ప్రయోగాల్లో పాల్గొన్నారు. భారత అంతరిక్ష ప్రయోగాలకు ఆద్యులైన విక్రమ్‌ సారాభారు, ప్రొఫెసర్‌ సతీష్‌ ధావన్‌, డాక్టర్‌ బ్రహ్మప్రకాశ్‌ శిష్యరికం కారణంగా కలామ్‌ ఈరంగంలో ప్రవేశించారు. డి.ఆర్‌.డి.ఓ.లో చీఫ్‌ సైంటిస్ట్‌గా పని చేస్తుండగానే ఆయన సారాభారు నేతృత్వంలోని 'ఐఎన్‌సిఓఎస్‌పిఏఆర్‌' (ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఆఫ్‌ స్పేస్‌ రీసెర్చ్‌) కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. 1969లో ఇస్రోలో చేరి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి దేశీయ ఉపగ్రహ ప్రయోగ వాహనం(శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌, ఎస్‌ఎల్‌వి-3) ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ వాహనం ద్వారానే 1980లో రోహిణి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. రాకెట్‌ అభివృద్ధి ప్రాజెక్టుల్లోనూ, అదేవిధంగా పోలార్‌ శాటిలైట్‌ వాహన ప్రాజెక్టులోనూ పాలుపంచుకున్నారు.

ఆంత్రిక్స్‌ కార్పొరేషన్‌ ఎస్‌ బ్యాండ్‌ కుంభకోణం

ఆంత్రిక్స్‌ అనేది ఇస్రో వాణిజ్య కార్యకలాపాల విభాగం. 1992 సెప్టెంబర్‌లో ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీగా ప్రారంభమైన ఇది ప్రభుత్వ సంస్థగా మారింది. అంతరిక్ష శాఖ ఆధ్వర్యంలో బెంగళూరు కేంద్రంగా పని చేస్తూ అంతరిక్ష పరిజ్ఞానం మొదలుకుని, పరికరాల అమ్మకంతో పాటు సిబ్బంది శిక్షణ, ఉపగ్రహాల ప్రయోగం, ఆ తరువాత లభించే డేటా అమ్మకం దాకా వివిధ రకాల సేవలనందిస్తుంది ఆంత్రిక్స్‌. అంతరిక్ష సంబంధిత పరిశ్రమల సామర్థ్యాలను పెంచడం కూడా దీని లక్ష్యాల్లో భాగంగా ఉంది. 2008లో 'మినీరత్న' హోదాను పొందింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా ఎదిగింది. అయితే గత ఏడాది 'ఆంత్రిక్స్‌-దేవాస్‌ కుంభకోణం'గా పేరు పడ్డ అవినీతి బాగోతం బయటపడడంతో ఇస్రో ఇన్నేళ్ల, ఇందరి కృషితో సంపాదించుకున్న పేరుప్రతిష్టలు ఒక్కదెబ్బకే మసిబారి పోయాయి. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రయివేటీకరణ విధానాలు ప్రభుత్వ రంగంతో పాటు అన్ని విలువలను నాశనం చేస్తోంది. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు ఇస్రోలోకి కూడా అవినీతి రాకెట్లు దూసుకొచ్చాయి. బెంగళూరుకు చెందిన దేవాస్‌ మల్టీమీడియా సంస్థకు ఎస్‌-బ్యాండ్‌ కేటాయింపుల కోసం అంత్రిక్స్‌ కుదుర్చుకున్న ఒప్పందంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అవకతవకతలకు పాల్పడి ఆ సంస్థకు అతి తక్కువ ధరకే స్పెక్ట్రమ్‌ కేటాయించారని తేలింది. 2జి స్కాం కంటే ఇది పెద్దదనీ, దీనివల్ల ఖజానాకు రెండు లక్షల కోట్ల రూపాయలు నష్టమని వార్తలొచ్చాయి. కుంభకోణంలో ఇస్రో మాజీ ఛైర్మన్‌ మాధవన్‌ నాయర్‌ పాత్ర ఉందని తేలింది. అంతేకాదు ప్రధాని, ప్రధానమంత్రి కార్యాలయం పాత్ర కూడా వివాదాస్పదమైంది. విచారణ కమిటీలు కూడా నాయర్‌ పాత్ర ఉందని తేల్చి చెప్పడంతో ఆయనతో పాటు ఈ అవినీతి బాగోతంలో పాలుపంచుకున్న మరో ముగ్గురు శాస్త్రవేత్తలు భవిష్యత్తులో ఎటువంటి ప్రభుత్వ బాధ్యతలూ చేపట్టకుండా నిషేధం విధించింది. ఈ ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. అయినా దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తే తప్ప ఇస్రోపై పడిన మచ్చ ఇప్పట్లో చెదిరిపోయేలా లేదు.

మూఢ నమ్మకాల్లో మునిగిపోతున్న సైంటిస్టులు

పూజలుపునస్కారాలు, జపతపాలు, శాంతిహోమాలు సమస్యలను తీర్చలేవు. మొక్కుబడులు చెల్లింపులు ఆకలిని తీర్చలేవు, అభివృద్ధిని సాధించలేవు అన్న సత్యం అర్థమైంది కాబట్టే ఆనాటి మన నేతలు సైన్సుబాట పట్టారు. శాస్త్రీయ పంథాలో సాగి దేశాభివృద్ధి సాధించాలని నిర్ణయించుకున్నారు. శాస్త్రీయ సాధనమైనందునే అంతరిక్ష విజ్ఞానాన్ని వినియోగించుకుని అభివృద్ధి పథంలో పయనించడం ఆరంభించారు. 'ఏ మతమూ, ఏ ఇజమూ సాధించలేనిది సైన్సు సాధిస్తుంది. అందుకే మనం శాస్త్రీయ మార్గంలో ముందుకు సాగుదాం'అని ప్రకటించాడు అంతరిక్ష ప్రయోగాలకు ఆద్యుడైన విక్రమ్‌ సారాబారు.
ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నామని సగర్వంగా ప్రకటించుకుంటున్న కొందరు శాస్త్రవేత్తలు మాత్రం మూఢనమ్మకాల్లో మునిగిపోతున్నారు. సైన్సుకే మచ్చ తెస్తున్నారు. వ్యక్తిగత నమ్మకాలు, విశ్వాసాలు ఉంటే ఉండొచ్చు కానీ వాటిని వృత్తిలోనూ ప్రదర్శించడమే వివాదాలు రేపుతున్నాయి. అంతరిక్ష పరిశోధనాశాలలు, ప్రయోగ కేంద్రాల్లో గుళ్లు గోపురాలు నిర్మిస్తున్నారు. ప్రతి పనీ ప్రారంభించే ముందు ఆయా దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉపగ్రహ ప్రయోగాలు చేసేటప్పుడైతే సామూహికంగా పెద్దఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. కొన్నిసార్లు శాంతి హోమాలు, పూజలు చేయిస్తున్నారు.కస్తూరిరంగన్‌ వంటి వారైతే ఏకంగా బాబాల వద్దకు కూడా వెళ్లారు. 'ఇదేమని' ప్రశ్నిస్తే సెంటిమెంటు అంటున్నారు. అది సెంటిమెంటు కాదు సూపర్‌స్టిషన్స్‌(మూఢనమ్మకాలు) అని విమర్శిస్తున్నారు సైన్సు కార్యకర్తలు. నాయకత్వ స్థానాల్లో ఉన్న వీరిని ఇతరులూ అనుసరిస్తూండడంతో ఈ మూఢనమ్మకాలు వ్యాపిస్తున్నాయి. విజ్ఞానంతో అంతరిక్షాన్ని సాధించగలిగిన శాస్త్రవేత్తలు వీటిని వదిలించుకోగలరా? శాస్త్రం గురించి చెప్పడం కాకుండా దాన్ని ఆచరిస్తూ ఏనాటికైనా ఆదర్శవంతంగా మారగలరా? అనేది ప్రస్తుతానికైతే సమాధానం లేని ప్రశ్నే!!

ఇస్రో గమనంలో ప్రధాన అడుగులు
* 1962 : భారత అంతరిక్ష పరిశోధనల కమిటీ(ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చ్‌) ఏర్పాటు
* 1963 : తుంబా ఈక్వటోరియల్‌ రాకెట్‌ లాంచింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు
* ఇదే ఏడాది నవంబర్‌ 21న ప్రప్రథమ రాకెట్‌ ప్రయోగం
* 1965 : తుంబలో అంతరిక్ష విజ్ఞాన సాంకేతిక కేంద్రం ఏర్పాటు
* 1972 : ఇస్రో స్థాపన
* 1975 : ఏప్రిల్‌ 19న దేశపు తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం
* 1979 : రెండవ ఉపగ్రహం భాస్కర-1 జూన్‌7న రష్యా నుంచి ప్రయోగం
* ఆగస్టు 10న ఉపగ్రహ ప్రయోగ వాహనం (ఎస్‌ఎల్‌వి-3) ప్రయోగం
* 1980 : శ్రీహరికోటలోని షార్‌ నుంచి రోహిణి ఉపగ్రహ ప్రయోగం
* 1981 : మే 31న రోహిణి-2 ప్రయోగం, జూన్‌ 19న ఆపిల్‌ శాటిలైట్‌ ప్రయోగం, నవంబర్‌ 20న భాస్కర-2 ప్రయోగం
* 1982 : ఇన్శాట్‌ ప్రయోగం
* 1984 : తొలిభారతీయుడు రాకేష్‌ శర్మ అంతరిక్ష యానం
* 1992 : ఏఎస్‌ఎల్‌వి ప్రయోగం
* 1994 : పిఎస్‌ఎల్‌వి ప్రయోగం
* 1995 : అంతరిక్ష డేటా మార్కెటింగ్‌ కోసం వివిధ దేశాలతో ఒప్పందం
* 2001 : జిఎస్‌ఎల్‌వి ప్రయోగం
* 2005 : శ్రీహరికోటలో రెండో లాంచ్‌ ప్యాడ్‌ ఏర్పాటు
* 2007 : తొలిసారి వాణిజ్య ప్రాతిపదికన ఇటలీకి చెందిన అగిలి ఉపగ్రహ ప్రయోగం
* 2008 : చంద్రయాన్‌ - 1 ప్రారంభం
* 2012 : వందో ప్రయోగం ద్వారా స్పాట్‌, ప్రొయిటెరిస్‌ ఉపగ్రహాల ప్రయోగం
1 నుంచీ 100 వరకు
1975లో సోవియట్‌ రష్యా రాకెట్‌ ఇంటర్‌కాస్మోస్‌ ద్వారా ఆర్యభట్ట ప్రయోగంతో అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టిన భారత్‌ ప్రస్తుతం విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఇస్రో మొత్తం 62 ఉపగ్రహాలు, 37 రాకెట్లు, ఒక స్పేస్‌ మాడ్యూల్‌తో కలిపి 'సెంచరీ' పూర్తి చేసింది. ఇస్రో ప్రయోగ సేవలు తక్కువ ధరకే లభించడంతో ఎన్నో దేశాలు తమ శాటిలైట్స్‌ను ఇక్కడ నుంచి ప్రయోగించడానికి ఆసక్తి చూపుతున్నాయి.
వందో ప్రయోగంతో వంద కోట్లు...
పిఎస్‌ఎల్‌వి-సి21 ద్వారా తమ స్పాట్‌-6 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టినందుకుగాను ఇస్రోకు ఫ్రాన్స్‌ రూ.100 కోట్లు చెల్లిస్తుంది. అదే విధంగా ప్రొయిటెరిస్‌ ప్రయోగానికి జపాన్‌ కూడా కొన్ని కోట్లు ఇస్తుంది. అయితే విదేశీ ఉపగ్రహ ప్రయోగాల వల్ల కొన్ని సార్లు దౌత్యపరమైన ఇబ్బందులూ ఎదురవుతాయి. ఉదాహరణకు 2008 జనవరిలో షార్‌ ఇజ్రాయిల్‌కు చెందిన పొలారిస్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది తమతమ దేశాల్లో గూఢచర్యం కోసమేనని పాకిస్తాన్‌తో పాటు పలు గల్ఫ్‌ దేశాలు, భారత్‌ను కూడా విమర్శించాయి. దానితో దేశం కొన్ని దౌత్య చిక్కులను ఎదుర్కోవలసి వచ్చింది.
అంతరిక్ష ప్రయోగాల వల్ల ప్రయోజనాలు
మనం సాధిస్తున్న అభివృద్ధిలో అంతరిక్ష పరిశోధనల పాత్ర ప్రధానమైనది. ఇవి సాధించిన ఫలితాలు ప్రతి రంగాన్నీ ప్రభావితం చేస్తూ వాటి అభివృద్ధికి కూడా దోహదం చేస్తున్నాయి. ప్రధానమైన కొన్ని ఉపయోగాలు...
* పంటల స్థితిగతులపై అధ్యయనం * భూగర్భ జలాల ఆచూకీ * కరువు కాటకాల వంటి దుర్భిక్షాల అంచనా * తుపాను, సునామీ తదితర ప్రకృతి వైపరీత్యాలు పసిగట్టడం * ఖనిజ నిక్షేపాల గుర్తింపు * కమ్యూనికేషన్‌ * బోధన * టెలిమెడిసిన్‌ * ఇంటర్నెట్‌ వంటి సౌకర్యాలు * విదేశీ మారక ద్రవ్యం ఆర్జన
'భారత్‌ లాంటి పేద దేశంలో భిన్న రంగాల అభివృద్ధి అంతరిక్ష ప్రయోగాలపై ఆధారపడి ఉంది' అని వందో ప్రయోగం సందర్భంగా ప్రధాని మన్మోహన్‌ అన్నారంటే ఈ రంగం ప్రయోజనాలేమిటో అర్థం చేసుకోవచ్చు.
ఇస్రో భవిష్యత్‌ కార్యక్రమాలు
సాధించిన దానితోనే సంతృప్తి చెందని ఇస్రో మున్ముందు చంద్రయాన్‌-2, మంగళ్‌యాన్‌, ఆదిత్యతో పాటు మరెన్నో అద్భుత ప్రయోగాలను నిర్వహించనుంది.
చంద్రాయన్‌ - 2
చంద్రునిపై జీవం ఉనికి కోసం పరిశోధన చేయడంలో భాగంగా ఇప్పటికే భారత్‌ చంద్రయాన్‌-1ను నిర్వహిస్తోంది. ఇది చంద్రునిపై నీటి గురించి కచ్చితమైన ఆధారాలందించింది. ఈ ప్రోత్సాహంతో భారత్‌ రెండో చంద్రయానానికి సిద్ధమైంది. ప్రారంభం నుంచీ తన అంతరిక్ష పరిశోధనల కోసం చేయూతనందిస్తున్న రష్యాతో కలిసి 2014లో చంద్రయాన్‌- 2 నిర్వహించనుంది. దీనిలో భాగంగానే రష్యా నిర్మించిన రోవర్‌ను షార్‌ నుంచి ప్రయోగిస్తారు.
మంగళ్‌యాన్‌
2013లో అంగారక గ్రహయాత్రకు ఉద్దేశించిన మంగళయాన్‌ను ప్రారంభిస్తుంది ఇస్రో. దీనిలో భాగంగా అంగారక గ్రహంపైకి మానవ రహిత యాత్ర నిర్వహిస్తుంది.
ఆదిత్య
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో నిర్వహించే మరో అద్భుత ప్రయోగం ఆదిత్య. సూర్యుడి బాహ్యవలయం కరోనా అధ్యయనం కోసం సాగించే ఈ ప్రయోగంతో భారత కీర్తి సూర్యుడిని చేరుతుంది.
తన 101వ ప్రయోగంగా ఇస్రో డిసెంబర్‌లో 13 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తుంది. అదేవిధంగా 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మొత్తం 58 ప్రయోగాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్రయోజెనిక్‌ పరిజ్ఞానం భారత్‌కు అందకుండా అమెరికా ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ క్రయోజెనిక్‌ ఇంజన్‌ సొంతంగానే నిర్మించి అమెరికాకు బుద్ధి చెబుతానని ధీమా వ్యక్తం చేసింది.

No comments:

Post a Comment