Monday, 1 October 2012

ప్రణికోటి మూగవేదన

జీవం కోసం గ్రహాంతరాల్లో రాకెట్ల సాయంతో వెతుకుతున్నాం. అరుణ గ్రహంపైకి నాసా క్యూరియాసిటీని పంపితే మన ఆనందానికి హద్దుల్లేవు. అక్కడ జీవం ఆనవాళ్ల కోసం అన్వేషిస్తుంటే అబ్బురపడుతున్నాం. క్యూరియాసిటీ పంపిన పర్వత ఛాయల కలర్‌ ఫోటోలను వీక్షించి ఆశ్చర్యం వెలిబుచ్చుతున్నాం. మన ఇస్రో అంగారక గ్రహ యాత్రకు సమాయత్తమవుతుంటే 'విజయీభవ' అంటూ ఆశీర్వదిస్తున్నాం. చంద్రయాన్‌ అంటే 'ఆహా' అంటున్నాం. మన చుట్టూ పరిసరాలను మాత్రం పట్టించుకోం. మన పర్వతాలను ఇష్టమొచ్చినట్లు తొలిచేస్తాం. విచ్చలవిడిగా అడవులను నరికేస్తాం. గనులను కొల్లగొడతాం. వృక్ష, జంతు జాతుల ఆవాసాలపై దాడులు చేసి తుదముట్టిస్తాం. కాలుష్య కారకాలతో హాని తలపెడతాం. 'విదేశీయులు' డబ్బు ఆశ పెడితే ఎంతటి పర్యావరణ క్షేత్రాలనైనా క్షణాల్లో ధ్వంసం చేస్తాం. అరుదైన వన్యప్రాణులనైనా వెంటబడి వేటాడతాం. కఠిన చట్టాలను సైతం ఉల్లంఘించి సునాయాసంగా తప్పించుకుంటాం. ఆహార భద్రతకు ముప్పు అన్నా తేలిగ్గా తీసుకుంటాం. మానవ అస్తిత్వానికి ప్రమాదం ఉన్నా ముందుకే అడుగులేస్తాం.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా జీవవైవిధ్యంపైనే చర్చ. ఆఫ్రికాలో అలా, అమెరికాలో ఇలా, ధ్రువ ప్రాంతంలో ఇంకోలా అంటూ జీవ మనుగడపై ఆలో'చించు'తున్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు మన దేశంలో అదీ మన హైదరాబాద్‌లో అక్టోబర్‌ 1 నుండి 19 మధ్య నిర్వహిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తెగ హడావిడి చేస్తోంది. నగరంలో భారీ డెకరేషన్లలో సుమారు రూ.500 కోట్లు ఖర్చు పెడుతోంది. రాష్ట్రంలో అంతరిస్తున్న అడవులు, జీవ, వృక్ష జాతుల గురించి మాత్రం మచ్చుకైనా చర్చ లేదు. ఇక్కడి జీవవైవిధ్యం సంరక్షణపై ప్రణాళికే లేదు. అసలు జీవవైవిధ్యం అంటే... అన్ని రకాల మొక్కలు, జంతువులు, వాటి జాతులు, ప్రజాతులు, వాటి జన్యు సంపద, అవి నివశించే ఆవాసాలలో ఉండే వైవిధ్యాన్ని కలిపి జీవవైవిధ్యం అంటారు. ఖండాంతరాల్లో జీవవైవిధ్యం సంగతి సరే... మన ఆవాసాల్లో జీవవైవిధ్య పరిరక్షణ మాటేమిటన్నది ప్రశ్న. ఈ విశ్వంలో మనకు తెలిసి జీవరాశి ఉన్న ఏకైక గ్రహం భూమి. అది క్రమక్రమంగా పర్యావరణపరమైన ప్రమాదకర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. అడవులు అంతరించడం, కాలుష్యం పెరగడం వంటి మానవ ప్రేరేపిత కారకాల వల్ల భూమి వేడెక్కడం (గ్లోబల్‌ వార్మింగ్‌), పర్యావరణ అసమతుల్యత (ఎకో ఇన్‌బ్యాలెన్స్‌), రుతుక్రమం మారటం (క్లయిమెట్‌ ఛేంజి) వల్ల ఆమ్ల వర్షాలు, ఓజోన్‌ పొరకు రంధ్రం వంటి తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
పెట్టని కోటలు తూర్పు కనుమలు
భారతదేశంలో కూడా పర్యావరణ సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ప్రకృతి పరంగా భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు, దక్షిణ ద్వీపకల్పం చుట్టూ సముద్రాలు ఉండటమే కాకుండా తూర్పు- పడమర తీర ప్రాంతాల వెంబడి అత్యద్భుతమైన పశ్చిమ కనుమలు (సహ్యాద్రి పర్వత పంక్తులు), తూర్పు కనుమలు (మల్యాద్రి పర్వత పంక్తులు) విస్తరించి ఉన్నాయి. పెట్టని కోటల వంటి పర్వతాలు, కొండలు, గుట్టలే కాకుండా విస్తారమైన అడవులు, వైవిధ్యభరిత వృక్షాలు, ఔషధ మొక్కలు, వన్యజీవులు, గిరిజన జాతులు, నదీనదాలు, ఖనిజ సంపద పర్యావరణ పరంగా గొప్ప వరాలుగా ఉన్నాయి.
సగం మన రాష్ట్రంలోనే
ఎంతో విశిష్టత కలిగిన తూర్పు కనుమలు పశ్చిమబెంగాల్‌, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలతో కలిసి దాదాపు రెండు వేల కిలోమీటర్ల నిడివి కలిగి ఒక్కో చోట వంద నుండి 200 కిలోమీటర్ల వెడల్పుతో రెండున్నర లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. ఉత్తరాన మహానది, దక్షిణాన కావేరి నది మధ్యన బంగాళాఖాతం వెంబడి విస్తరించి ఉన్నాయి. ఒరిస్సాలో మయూర్‌బంజ్‌, పల్లంకిని, నిమగిరి, మహేంద్రగిరి, నంబారికొండ, ఆంధ్రప్రదేశ్‌లో యారాడ, అరకులోయ, పాపికొండలు, ఇంద్రకీలాద్రి, నల్లమల, ఎర్రమల, పాలకొండ, వెలికొండ, శేషాచలం, కంబక్కాం, తమిళనాడులో కొల్లమలై, పాచమలై, కల్‌రాయన్‌ హిల్స్‌, చిట్టేరి, పాలమలై, మెట్టూరు హిల్స్‌ ఇలా స్థానిక పేర్లతో తూర్పు కనుమలు పిలవబడుతున్నాయి. తూర్పు పర్వత పంక్తుల సరాసరి ఎత్తు 750 మీటర్లు కాగా గరిష్టంగా 1,600 మీటర్ల ఎత్తు కలిగి ఉన్నాయి. తమిళనాడులోని నీలగిరి వద్ద తూర్పు కనుమల పర్వత శ్రేణి, పడమటి కనుమల పర్వత శ్రేణి మిళితం అవుతున్నాయి. తూర్పు కనుమల్లో అనేక ప్రధాన జీవ నదులు ప్రవహిస్తూ పర్వతాలను విభజిస్తున్నాయి. మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి వంటి జీవ నదుల పరివాహక ప్రాంతం ఈ కనుమల్లోనే విస్తరించి ఉంది. నదుల పరివాహక ప్రాంతంలో నిర్మితమైన భారీ రిజర్వాయర్లు నాగార్జునసాగర్‌, శ్రీశైలం వ్యవసాయ, విద్యుత్‌ రంగాలకు వెన్నుదన్నుగా నిలిచాయి. అదే విధంగా మాచ్‌ఖండ్‌, సీలేరు, కొండపల్లి హైడ్రో, థర్మల్‌ ప్రాజెక్టులు ఇక్కడ ఉన్నాయి. తూర్పు కనుమల్లో ప్రధానంగా సింహాచలం, తిరుమల, శ్రీశైలం, కనకదుర్గాలయం, అన్నవరం, ద్వారక తిరుమల, మహానంది, భద్రాద్రి ఇలా ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. తూర్పు కనుమల విస్తీర్ణం అత్యధికంగా 48 శాతం మన రాష్ట్రంలోనే ఉంది. సుమారు 980 కిలోమీటర్లు శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు విస్తరించి ఉన్నాయి. ఒరిస్సా, తమిళనాడులో 25 శాతం చొప్పున, కర్నాటకలో రెండు శాతం విస్తరించి ఉన్నాయి.
గుర్తింపేది?
హిమాలయాలు, పశ్చిమ కనుమల కంటే ముందే తూర్పు కనుమలు ఏర్పడ్డాయని చారిత్రక, భౌగోళిక పరిశోధనలు చెబుతున్నాయి. మధ్య మధ్య అంతరాలతో ఏర్పడిన తూర్పు కనుమల పర్వత శ్రేణులు ఎన్నో అమూల్యమైన వృక్ష, జీవరాశులకు ఆలవాలంగా ఉన్నాయి. జీవవైవిధ్యానికి అద్దం పడుతున్నాయి. చెంచు, కోయ, సవర, జాతపు, కొండ దొర, గదబ, ఖోండు, మన్నె దొర, ముఖ దొర వంటి గిరిజన జాతులు తూర్పు కనుమలతో పెనవేసుకున్నాయి. తూర్పు కనుమల్లో కొన్ని వేల ఏళ్ల కిందటే బౌద్ధం భాసిల్లింది. నాగార్జునకొండ, అమరావతి, బావికొండ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బౌద్ధ క్షేత్రాలు. స్వాతంత్య్రం వచ్చాక కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమూ తూర్పు కనుమల పరిరక్షణపై శ్రద్ధ పెట్టలేదు. ఏవో నామమాత్రపు చర్యలకే పరిమితం. పశ్చిమ కనుమల పరిరక్షణకు మహారాష్ట్ర, గోవా, కర్నాటక, కేరళ ప్రభుత్వాలు ఎంతో కృషి చేయగా తూర్పు కనుమల పరిరక్షణకు మన రాష్ట్రం పెద్దగా చేసిందేమీ లేదు. పడమటి కనుమలను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించగా అంతకంటే పురాతనమైన, జీవవైవిధ్యానికి ఆలవాలమైన తూర్పు కనుమలు గుర్తింపునకు సైతం నోచుకోలేదు. ప్రపంచంలో భౌగోళికం, పర్యావరణం, జీవవైవిధ్యం పరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన హాట్‌స్పాట్స్‌లో తూర్పు కనుమల్లేవు. బయోడైవర్శిటీ, హాట్‌స్పాట్స్‌ అని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే ఇండియాలోని తూర్పు హిమాలయాలు, పడమటి కనుమలు కనబడుతున్నాయి మినహా తూర్పు కనుమలు అన్న మాటే లేదు. అంతరించే ముప్పు ఉన్న ఐదు ఎకొలాజికల్‌ హాట్‌ స్పాట్స్‌ను భారత ప్రభుత్వం ప్రకటించగా అందులో రెండు తూర్పు కనుమల్లోనే ఉన్నాయి. అయినా సర్కారుకు జీవవైవిధ్యాన్ని కాపాడటంపై చిత్తశుద్ధి లేదు. పడమటి కనుమలతో పోల్చితే తూర్పు కనుమల్లో పరిశోధనలు చాలా తక్కువ. కొత్త జంతు, జీవ జాతులను కనుగొనడం నామమాత్రం. మావోయిస్టుల వల్ల అధ్యయనం జరగలేదంటున్నారు శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు. ఆ వాదన అంతగా అతికేదికాదు. 'పెద్దల' సంపాదన యావ, ప్రైవేటు, బహుళజాతి కంపెనీలకు దోచిపెట్టే ప్రభుత్వ విధానాల వల్లనే పర్వతాలకు బొర్రెలు పడుతున్నాయి. అడవులు, పర్యావరణం, వన్యప్రాణులు నాశనమవుతున్నాయి. జీవవైవిధ్యం విచ్ఛిన్నమవుతోంది. ఈ వాస్తవాలను కప్పెట్టేందుకు మనిషి చేష్టల వల్లనే జీవవైవిధ్యం దెబ్బతింటోందంటూ కుహన మేధావులు, ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జివొ) పల్లవి ఎత్తుకున్నాయి. ప్రకృతి వరాలైన పడమటి కనుమలు, తూర్పు కనుమల మధ్యనున్న దక్కన్‌ పీఠభూమి సైతం జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. ఇక్కడి అడవులను, సహజ వనరులను, గనులను ప్రభుత్వమే అంగట్లో పెట్టి మరీ విక్రయిస్తోంది.
3,700 జీవ జాతులు గుర్తింపు
తూర్పు కనుమల్లో వైవిధ్యమైన 3,700 వృక్ష, జంతు జాతులను ఇప్పటి వరకు గుర్తించారు. బఠాణి రకాలు 380, అరుదైన పూల మొక్కల జాతులు 200 వీటిలో ఉన్నాయి. నాలుగొందల రకాల గడ్డి జాతులను కనుగొన్నారు. కనుగొన్న వృక్ష జాతుల్లో 1,400 ఔషధ మొక్కలే. అధ్యయనం జరిగితే మరిన్ని వృక్ష, జంతు జాతులు బయటపడే అవకాశం ఉంది. ఆసియాలో అతి పెద్ద పులుల అభయారణ్యం నల్లమలలో ఉంది. 'శ్రీశైలం-నాగార్జునసాగర్‌' టైగర్‌ రిజర్వ్‌గా పిలుస్తున్నారు. అంతరిస్తున్న పులి జాతిని సంరక్షించేందుకు 3,600 చదరపు కిలోమీటర్ల నల్లమల అటవీ ప్రాంతాన్ని రిజర్వ్‌ చేశారు. మనది రాయల్‌ బెంగాల్‌ పులుల జాతి అనంటున్నా నల్లమలలో పులులు బెంగాల్‌, ఒరిస్సాలో కంటే విభిన్నంగా, బలిష్టంగా ఉంటాయి. ఇక్కడ ఎన్ని పులులు ఉన్నాయన్న లెక్కలపై ఎన్నో సందేహాలు. పగ్‌ మార్కులు, డిజిటల్‌ కెమేరాల సాయంతో లెక్కిస్తున్నామని ప్రభుత్వం చెబుతుండగా ఆ పద్ధతి అంత శాస్త్రీయంగా లేదని మూడేళ్ల కింద కాగ్‌ తప్పుబట్టింది. జీవ జాతులపై పరిశోధనలకు శ్రీశైలంలో నెలకొల్పిన ల్యాబ్‌ నామమాత్రంగానే పని చేస్తోంది. ఇటీవలికాలంలో నల్లమలతోపాటు మొత్తం తూర్పు కనుమల్లో అడవుల నరికివేత విచ్చలవిడిగా సాగుతోంది. స్మగ్లర్లు వృక్ష, జంతు సంపదను అక్రమంగా తరలిస్తున్నారు. జంతువుల ఆవాసాల విధ్వంసాన్ని చట్టాలు, ప్రభుత్వం, అధికారులు నిరోధింపలేకున్నాయి. ఎస్‌ఆర్‌బిసి సొరంగం, శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో రివర్స్‌బుల్‌ పంపింగ్‌కు సొరంగం తవ్వినప్పుడు రాతి శకలాలను వేరే ప్రాంతానికి డంపింగ్‌ చేయకుండా అక్కడే పడేయడంతో అభయారణ్యం కొంత వరకు మసకబారింది. గతంలో నల్లమల, శేషాచల అడవులు కలిసే ఉండేవి. ఏనుగులు తిరిగేవి. అడవులు అంతరించడంతో ఏనుగుల సంచారం నిలిచిపోయింది. ఏనుగులు శేషాచలానికి పరిమితమయ్యాయి. శేషాచలం కొండలు, గుండ్లబ్రహ్మేశ్వరం, కంబాలకొండ, కౌండిన్య, పాపికొండలు, పోచారం, రోళ్లపాడు, శ్రీ లంక మల్లేశ్వరం, శ్రీ పెనిన్సుల నరసింహ, శ్రీవెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ క్షేత్రాలను కేంద్రం ప్రకటించింది. నల్లమల, విశాఖ, నెల్లూరు, శ్రీవెంకటేశ్వర, అరకు లోయ, నాగార్జునకొండ, మారేడుమల్లి, చిత్తూరు జిల్లాలతో పాటు మెదక్‌ను బయలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా జీవావరణ కేంద్రాలుగా ప్రకటించింది. విలక్షణమైన 15 చిత్తడి నేలలను, 16 విభిన్న మడ అడవులను కేంద్రం గుర్తించింది. నేషనల్‌ బయోడైవర్శిటీ అథారిటీ 2002 బయోడైవర్శిటీ చట్టంలో భాగంగా ఏడు మేనేజింగ్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. ఒరిస్సా, ఎ.పి, బెంగాల్‌లో ఏనుగుల సంరక్షణ కోసం ప్రత్యేక ప్రాజెక్టు 1992లో ప్రారంభమైంది. అడవుల పరిరక్షణలో తమిళనాడు ముందుంది. తూర్పు కనుమల పరిధిలో 22 శాతంగా ఉన్న అడవులను 27 శాతానికి ఆ రాష్ట్రం పెంచగా అత్యధిక కనుమలు ఉన్న మన రాష్ట్రంలో అడవులు 23 శాతం వద్దనే ఉన్నాయి. వాస్తవ లెక్కలు తీస్తే ఇంకా తగ్గుతుంది.
సర్కారే శత్రువు
విచ్చలవిడి మైనింగ్‌ వల్ల వృక్ష, జంతు జాలం నాశనమవుతోంది. అడవులపై ఆధారపడ్డ గిరిజన జాతుల మనుగడకు, సంస్కృతికి విఘాతం కలుగుతోంది. చట్టాలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మరీ ప్రభుత్వమే అడ్డదారుల్లో మైనింగ్‌కు అనుమతిస్తోంది. గిరిజనులు వద్దంటున్నా విశాఖ ఏజెన్సీలో బాక్సయిట్‌ తవ్వకాలకు 'ప్రైవేటు'తో ఒప్పందాలు చేసుకుంది. పోలవరం నిర్మిస్తే పాపికొండలు మునుగుతాయని, గిరిజన జాతుల బతుకు ఛిద్రమవుతుందని, జీవవైవిధ్యం అంతరిస్తుందని తెలిసినా ప్రతిపాదిత ఎత్తులో ప్రాజెక్టును నిర్మించేందుకు కంకణం కట్టుకుంది. నల్లమలలో వజ్రాలు వెలికితీత పేరు మీద చెంచులను అడవుల నుండి తరిమి వేసేందుకు సిద్ధమైంది. ఆదిలాబాద్‌ జిల్లాలో కవాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టు కోసం అక్కడి గిరిజనులను తరిమేస్తోంది. నెల్లూరులో విదేశీ పక్షుల విడిది కేంద్రం పులికాట్‌ సరస్సు ఎడారిగా మారుతోంది. పశ్చిమగోదావరి- కృష్ణాలో కొల్లేరు సరస్సు 'పెద్దల' చెరలో తన సహజత్వాన్ని కోల్పోయింది. శ్రీకాకుళంలో బీలపై 'థర్మల్‌' దాడి జరుగుతోంది. థర్మల్‌, యురేనియం ప్లాంట్ల వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడింది. తీర ప్రాంతంలో మడ అడవులు ధ్వంసం కావడంతో సముద్ర జీవులెన్నో అంతరించిపోతున్నాయి. మడ అడవులుంటే సముద్రం ఉప్పొంగినప్పుడు నీటి ప్రవాహ తీవ్రతను కొంత వరకు ఆపుతుంది. తూర్పు కనుమల్లో మైనింగ్‌ వల్ల ఐదు ప్రధాన జంతు జాతులు పులులు, ఏనుగులు, గద్దలు, మొసళ్లు, పలు వృక్ష జాతులు అంతర్ధానమయ్యే ప్రమాదం ఏర్పడింది. హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌కు ఒకప్పుడు విదేశీ పక్షులొచ్చేవి. ఇప్పుడా చెరువు మురికి కూపంగా మారింది. వ్యవసాయంలో విత్తనాలపై ప్రైవేటు ఆధిపత్యం వహిస్తోంది. ఆహార పంటలు తగ్గుతున్నాయి. చిరుధాన్యాలు, పప్పుధాన్యాల సాగు తరిగిపోతోంది. బీటి పత్తి విత్తనాలొచ్చి సంప్రదాయ పత్తి రకాల అడ్రస్‌ గల్లంతు చేశాయి. ప్రాణికోటికి జీవాధారం నీరు. చిన్న పెద్ద చెరువులు లక్ష వరకు ఉండగా వాటిని నిర్లక్ష్యం చేయడంతో పల్లె సీమల వాతావరణంలో విపరీతమైన మార్పులొచ్చాయి. మొక్కలు, జీవ మనుగడకు విఘాతం ఏర్పడింది. ఫ్లోరైడ్‌ పెరిగిపోతోంది. చిన్న చిన్న నిర్లక్ష్యాలు కలిపి మహా నిర్లక్ష్యంగా అవతరించడం వల్ల జీవవైవిధ్యం పెను ప్రమాదంలో పడింది. అంతర్జాతీయ సదస్సు మన హైదరాబాద్‌లో జరిగితే మనకేంటి? మన తూర్పు కనుమలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు కల్పిస్తుందా? మన దక్కన్‌ పరిరక్షించబడుతుందా? ఈ సదస్సు మన పర్యావరణాన్ని రక్షిస్తుందా లేక మన వనరులపై అగ్రరాజ్యాలు, బహుళజాతి కంపెనీల 'ఆకలి'కి ఆహారం అవుతాయా? ప్రతి అభివృద్ధి వెనుక ఒక విధ్వంసం ఉంటుంది. వాటి మధ్య సమతుల్యత దెబ్బతిని అభివృద్ధిపై విధ్వంసం పైచేయి సాధిస్తే జీవవైవిధ్యానికి, ప్రాణికోటికి ముప్పు తప్పదు.
మన ప్రత్యేకత
మన దేశంలో అత్యద్భుతమైన జీవవైవిధ్యం ఉంది. ప్రపంచంలోని అత్యధిక జీవవైవిధ్యం ఉన్న 17 దేశాల్లో భారత్‌ ఒకటి. అందుకే అతిపెద్ద బయోడైవర్శిటీ దేశంగా గుర్తింపు వచ్చింది. ప్రపంచంలోని మొత్తం జీవ జాతుల్లో ఎనిమిది శాతం ప్రాణులకు మనదేశం పుట్టినిల్లు. దేశంలో 18 వేలకుపైగా వృక్ష జాతులు, 390 రకాల క్షీరదాలు, 458 జాతుల పక్షులు, 521 జాతుల సరీసృపాలు, 238 రకాల ఉభయచర జీవులు మనుగడ సాగిస్తున్నాయి. దాదాపు ఆరు వేల రకాల చేపల జీవవైవిధ్యంతో ప్రపంచంలో భారత్‌ అగ్ర స్థానంలో ఉంది. దేశంలో 668 రక్షిత ప్రాంతాలున్నాయి. పదహారు లక్షల చదరపు కిలోమీటర్లకు పైగా, మొత్తం భూ భాగంలో సుమారు ఐదు శాతం జీవవైవిధ్య ప్రత్యేకతల రీత్యా రక్షిత ప్రాంతంగా గుర్తింపబడింది. 102 జాతీయ పార్కులు, 515 వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, పులులు 40 కేంద్రాల్లో, ఏనుగులు 28 కేంద్రాల్లో విశాలమైన అటవీ ప్రాంతంలో జీవిస్తున్నాయి. 'ఫ్లోరా అండ్‌ ఫౌనా' ప్రత్యేకతల రీత్యా ప్రపంచ వ్యాప్తంగా యునెస్కో గుర్తించిన హెరిటేజ్‌ సెంటర్లలో రెండు... తూర్పు హిమాలయాలు, పడమటి కనుమలు మన దేశంలో ఉన్నాయి. ఫలపుష్ప జాతులు, ఇతర జీవ జాతుల ప్రత్యేకతల దృష్ట్యా ఇరుగు పొరుగు దేశాలు సంయుక్తంగా పని చేసేందుకు యునెస్కో తగు ఏర్పాట్లు చేసింది. జాతులు, ప్రజాతుల పరంగా రికార్డు చేసిన 45 వేల వృక్ష జాతులు, 91 వేల జంతు జాతులతో మన దేశం ప్రపంచ జీవవైవిధ్య సంరక్షణా రంగంలో కృషి చేస్తున్న వారికి ప్రముఖ సందర్శనీయ స్థలంగా యునెస్కో అభివర్ణించింది. పంటల వైవిధ్యం రీత్యా ప్రపంచంలో ఎనిమిది ప్రధాన దేశాల్లో మన దేశం ఒకటి. వరి, తృణ ధాన్యాలు, కూరగాయలు తదితర 375 వైవిధ్య పూరిత రకాలు, 140 రకాల పెంపుడు జంతువులు మన నిత్య జీవితంతో పెనవేసుకున్నాయి.
లాభాపేక్ష
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూమి పుట్టి 460 కోట్ల సంవత్సరాలు. ఆ తర్వాత 20 కోట్ల సంవత్సరాలకు అంటే 440 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై తొలి పుష్పం వికసించింది. ఎనిమిది కోట్ల సంవత్సరాల కింద క్షీరదాలు పుట్టాయి. కోతి నుండి మనిషిగా పరిణామం చెంది నాలుగు లక్షల ఏళ్లవుతోంది. మనిషి పుట్టక ముందే ప్రకృతి ఉంది. మొక్కలున్నాయి. సమస్త జీవరాశులు ఉన్నాయి. విశేష మేథాసంపన్నుడైన మోర్గాన్‌ మానవ జాతి ఆదిమ చరిత్రను మొట్ట మొదటి సారిగా ఒక క్రమ పద్ధతిలో పెట్టాడు. ఆదిమ చరిత్రను మూడు యుగాలుగా వర్గీకరించాడు. ఆటవిక యుగం, అనాగరిక యుగం, ఆధునిక యుగం. ఆటవిక యుగంలో మనిషి కాయలు, పళ్లు, దుంపలు తిని బతికాడు. జంతు సముదాయం నుండి క్రమంగా పరిణామం పొందాక నిప్పు కనుక్కున్నాడు. మానవుడు తొలిసారిగా కనిపెట్టిన ఆయుధాలు గద, ఈటె. వాటి సహాయంతో జంతువులను వేటాడేవాడు. అప్పుడప్పుడు జంతువులు తిండికి దొరికేవి. అంతే తప్ప కేవలం వేట మీదనే మానవులు జీవించలేదు. వేటతో తిండి సంపాదన ఎప్పుడూ అనిశ్చితే. వ్యవసాయం కనిపెట్టి ఆహారోత్పత్తి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం మొదలైంది. మనిషి పుట్టక ముందు భూమి మీద సంవత్సరానికి ఒక జీవ జాతి అంతరించింది. ఆటవిక యుగంలో వేటపై మానవులు ఆధారపడినప్పుడు కూడా జాతులు అంతగా అంతరించలేదు. కానీ పారిశ్రామిక విప్లవం ఎప్పుడైతే ప్రారంభమైందో రెండొందల సంవత్సరాల నుండి పర్యావరణానికి, జీవ జాతులకు ప్రమాదం ఏర్పడింది. మార్కెట్‌ ఆధారిత లాభాపేక్ష వృద్ధి అయ్యాకనే ఓజోన్‌ పొరకు చిల్లు, గ్లోబల్‌ వార్మింగ్‌, ఎల్‌నినో, సునామీ, భూకంపాల వంటి పెను ప్రమాదాలు విరుచుకు పడుతున్నాయి. ప్రతి ఇరవై నిమిషాలకో జీవ జాతి అంతమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల జీవజాతులున్నాయని అంచనా వేయగా ఇప్పటికి కనుగొన్నది 45 లక్షలు. ప్రకృతిలో తెలిసిన వాటి కంటే తెలియనివే ఎక్కువ. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందినా ఒక జీవిని సృష్టించలేం. ప్రకృతి లేనిదే మానవుడు లేడు. ప్రకృతిని పరిరక్షించడమే మానవుల కర్తవ్యం.
జీవవైవిధ్యం విశేషాలు
* ప్రపంచ వ్యాప్తంగా మనుషులు ఆహారంగా ఉపయోగించే జంతు జాతులు 12.
* ఆహారానికి ఉపయోగించే మొక్కల జాతులు 15
* ప్రపంచంలో 2/3 వంతు ఆహారం గోధుమలు, కార్న్‌, బియ్యమే.
* అంతరించే ముప్పు ఉన్న జీవ జాతుల రిజిస్టర్‌ను ఐయుసిఎన్‌ అనే అంతర్జాతీయ సంస్థ నిర్వహిస్తోంది
* హిమాలయాల్లో ఉండే రెడ్‌ పాండా అనే జంతువు దాదాపు అంతరించింది.
* ప్రపంచం గుర్తించిన జీవావరణ రిజర్వ్‌లు దేశంలో నాలుగు ఉండగా రాష్ట్రంలో ఒక్కటీ లేదు.
* ఇప్పటి వరకు దేశంలో ఉన్న అటవీ సంరక్షణ చట్టాలు: 1) 1927- భారత అటవీ చట్టం 2) 1972- వన్యప్రాణి (సంరక్షణ) చట్టం 3) 1980-ఎఐఆర్‌ చట్టం 4) 1986- పర్యావరణ (రక్షణ) చట్టం.
* దేశంలో అంతరించే ప్రమాదం ఉన్న జీవ జాతులు: ఆసియాటిక్‌ సింహం, కృష్ణ జింక (ఎపి), రెడ్‌ పాండా, పులి, పెద్ద పులి, ఏనుగు, కాశ్మీరీ మగ జింక, పిచ్చుక, సైబేరియన్‌ కొంగ, దేవాంగి పిల్లి.
* ప్రపంచంలో తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్న వంద జీవరాసుల జాబితాలో రాష్ట్రానికి చెందిన సాలె పురుగు (గూటీ టరంటులా), బట్టమేక పక్షి చేరాయి. వాటితో పాటు ఈశాన్య భారతంలోని తెల్లపొట్ట కొంగ, నాలుగు వేళ్ల తాబేళ్లు కూడా చేరాయి.
* 19వ శతాబ్దం మొదట్లోనే అంతరించి పోయిందనుకున్న కలివి కోడి కడప జిల్లాలో 1982లో కనిపించి ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచింది.
* నల్లమలలో లభించే ఔషధ మొక్క కలబంద (అలొవెరా)తో అమెరికాలో ఔషధాలు తయారు చేసే పెద్ద పరిశ్రమ వెలిసింది.
* నల్లమల, శేషాచలంలో లభించే ఎర్ర చందనం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. పలు దేశాలు ఎర్ర చందనాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి.
* మన ఒంగోలు గిత్త బ్రెజిల్‌ దేశ ప్రధాన ఆర్థిక వనరు.
* నంద్యాల, మహానంది ప్రాంతంలో బిటి బాక్టీరియాను అమెరికా సంస్థ మోన్‌శాంటో తీసికెళ్లి, నంద్యాలలో మన వ్యవసాయ వర్శిటీ రూపొందించిన నర్సింహ హైబ్రిడ్‌ పత్తిలో చొప్పించి బిటి పత్తి విత్తనాల పరిజ్ఞానంపై పేటెంట్‌ పొందింది.
* అంతర్జాతీయ వాణిజ్యం ఫలితంగా ప్రపంచంలో మూడో వంతు జాతులకు ముప్పు వాటిల్లుతోంది.
* అమెరికా, ఐరోపా, జపాన్‌ దేశాలు జీవవైవిధ్యాన్ని దెబ్బతీసే ఉత్పత్తులను తెగ వాడేస్తున్నాయి. తమ తమ దేశాల్లో కాలుష్య సమస్య తలెత్తకుండా పేద దేశాల్లో ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నాయి.
* దేశంలోని బయోడైవర్శిటీ సంస్థలు: బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, బొంబాయి నేచురల్‌ హిస్టరీ సొసైటీ, వైల్డ్‌లైఫ్‌ ప్రొటక్షన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా డెహ్రాడూన్‌, ఇక్రిశాట్‌ (ఎపి).
* ప్రకృతి నుండి మనిషి తీసుకునే దానిలో సమతూకం పాటించాలని 1992లో రియోలో జరిగిన తొలి ఎర్త్‌ సమ్మిట్‌ స్పష్టం చేసింది. ప్రకృతి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, విధి, విధానాలకు రూపొందించిన డాక్యుమెంట్‌పై భారత్‌ సహా 193 దేశాలు సంతకం పెట్టాయి. అగ్రరాజ్యం అమెరికా తప్ప.
* ఐక్యరాజ్య సమితి 2011-20 సంవత్సరాలను జీవవైవిధ్య దశాబ్దంగా ప్రకటించింది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే అంతర్జాతీయ సదస్సులు ఇప్పటి వరకు పది జరగ్గా, హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నది పదకొండవది కాగా జీవవైవిధ్య దశాబ్దంలో మొదటిది. సదస్సుకయ్యే పూర్తి వ్యయాన్ని ఐక్యరాజ్య సమితి భరిస్తుంది.
- కె.ఎస్‌.వి. ప్రసాద్‌

No comments:

Post a Comment